సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతమున్న 31 జిల్లాలకు తోడుగా మరోరెండు నూతన జిల్లాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 17(ఆదివారం) నుంచి ములుగు, నారాయణపేట జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. 9 మండలాలతో కూడిన ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా పరిధిలోకి రానున్నాయి. నారాయణపేట జిల్లాను 11 మండలాలతో ఏర్పాటు చేశారు. నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఉట్కూర్, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలు నారాయణపేట పరిధిలోకి రానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో సమ్మక్క - సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment