పెట్టుబడుల వెల్లువ
- పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకే ‘ఐపాస్’
- చిన్న పరిశ్రమలకు కూడా స్థలాల కేటాయింపు
- ఆన్ లైన్‌లో దరఖాస్తుకు ప్రత్యేక వెబ్‌సైట్
- పరిశ్రమల స్థాపనలో యువతకు శిక్షణ
- రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అనుమతుల జారీని సరళతరం చేయడంతో జిల్లాకు పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల శాఖను సమీక్షించారు. గతేడాది కాలంలో సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూములు పొంది ఆర్నెళ్లలోపు పరిశ్రమలు స్థాపించకపోతే కేటాయింపులను రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు.
చిన్న, సూక్ష్మ తరహా యూనిట్లను కూడా ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 200 గజాల స్థల ంలో కూడా యూనిట్ పెట్టదలిచే పారిశ్రామికవేత్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ భూముల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు చెప్పారు. గతేడాది జిల్లాలో రూ.1,920 కోట్లతో 4,152 పరిశ్రమలు వచ్చాయని, తద్వారా 49వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ఈ ఏడాది టీఎస్- ఐపాస్ కింద 174 కంపెనీలకు అనుమతులు జారీ చేశామని, ఈ సంస్థలు రూ.221.58 కోట్ల పెట్టుబడులు పెట్టాయని వివరించారు.
అవినీతిరహిత ంగా పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలనే సంకల్పంతో శ్రీకారం చుట్టిన టీఎస్ -ఐపాస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు తగినంత భూమి ఉందని, జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 3,600 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. టీఎస్‌ఐఐసీ ద్వారా కేటాయించిన భూమి నిరుపయోగంగా ఉంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.
అంతేకాకుండా అవసరాలకుపోను మిగతా భూములను కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. గ్రామీణ, మండలస్థాయిలో పరిశ్రమల స్థాపనకు యువతకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డెరైక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.