మెదక్ రూరల్, న్యూస్‌లైన్: నిన్నటి వరకూ కొనుగోలు కేంద్రాలు లేక సతమతమైన రైతన్నలకు ఇపుడు కొత్త చిక్కొచ్చిపడింది. ధాన్యం రైతుల ఇళ్లకు చేరి దళారుల పాలవుతున్నా పట్టించుకోని అధికారులు ఉన్నట్టుండి ఊరికి రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యుత్సాహం చూపారు. దీంతో కొనుగోళ్లు జరిపేందుకు రెండు కేంద్రాల వారు సిద్ధం కావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు రైతులు ఏ కేంద్రంలో ధాన్యం విక్రయించాలో తెలియక అయోమయంలో పడిపోయారు.
ఊరికి రెండు కేంద్రాలు
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని భావించిన ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు కేటాయించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. దీంతో అటు మహిళలకు పని కల్పించడంతో పాటు అన్నదాతకు మద్దతు ధర కల్పిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం నుంచీ ఐకేపీతో పాటు ప్రాదేశిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు సైతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో పలు గ్రామాల్లో ఇటు ఐకేపీ, పీఏసీఎస్ సంఘాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
ఈక్రమంలోనే ధాన్యం కొనుగోలుకు పోటీ పెరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలోనే మండల పరిధిలోని సర్దన, భూర్గుపల్లి గ్రామాల్లో ఈసారి కూడా రెండేసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ధాన్యం కొనుగోలుకు పోటీ పెరగడంతో మహిళా సంఘాల సభ్యులు, పీఏసీఎస్ సిబ్బందికి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం మహిళా సంఘాల సభ్యులు ధాన్యం కొనుగోలు చేసే ప్రాంతంలోనే పీఏసీఎస్ సిబ్బంది కూడా కొనుగోళ్లు చేపట్టారు.
ఇందుకు మహిళా సంఘాల సభ్యులు అభ్యంతరం తెలపడంతో పీఏసీఎస్ సిబ్బంది గొడవకు దిగారు. రైతు తమకు విక్రయిస్తానంటేనే కొనుగోళ్లు చేపడుతున్నామని పీఏసీఎస్ సిబ్బంది చెబుతుండగా, తాము కొనుగోళ్లు జరిపే ప్రాంతానికి వచ్చి మరీ కొనుగోళ్లు జరపడమేమిటని మహిళా సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఒకే గ్రామంలో రెండేసి కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడం వల్లే గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై మండల ఏపీఎం సరితను వివరణ కోరే ందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
‘పోటాపోటీ’తో పోట్లాట
Published Wed, May 14 2014 11:51 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement