దసరాకి కల్లు దుకాణాలు
విధి విధానాలు రూపొందిస్తున్న ఎక్సైజ్ శాఖ
నెలాఖరులోగా తుదిరూపం ఇచ్చే అవకాశం
కల్లు అమ్మకాలపై ఎన్నికల హామీ అమలుకే మొగ్గు చూపిన కేసీఆర్
2004లో నగరంలో 103 షాపులు, 42 సొసైటీలు
23వ తేదీ లోగా రాజకీయ పార్టీల సూచనలు కోరిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్లు దుకాణాలు తెరుచుకోబోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలో 2004లో మూతపడ్డ కల్లు దుకాణాలను తిరిగి తెరిపించేందుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపడంతో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో, లోగడ మూసివేతకు గురైన దుకాణాలను వచ్చే దసరా పండుగలోగా తెరిపిస్తామని కేసీఆరే ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల నగరంలోని కల్లు గీత కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం నిర్ణయానికి అనుగుణంగా నగరంలో కల్లు దుకాణాల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాల రూపకల్పనలో ఎక్సైజ్ శాఖ తలమునకలైంది. ఈ నెలాఖరులోగా ఏరీతిన ఈ దుకాణాలను తెరిపించి, నడిపించాలన్న అంశానికి తుదిరూపం ఇచ్చి, కార్యాచరణలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి డీసీలకు బాధ్యత అప్పగింత
నగరంలో ఈ దుకాణాలు మూతపడేనాటికి 2004లో 103 ఉండేవి. నలభై రెండు సొసైటీల ద్వారా ఈ దుకాణాల్లో అమ్మకాలు సాగేవి. ఒక్కో సొసైటీలో 300 నుంచి 1000 మంది వరకు సభ్యులు ఉండేవారు. అయితే 50 కిలోమీటర్ల పరిధిలో చెట్లులేని పట్టణాలు, నగరాల్లో కల్లు విక్రయాలు సాగించకూడదని అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దుకాణాలు మూతపడ్డాయి. కానీ గ్రేటర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లా, మెదక్ ప్రాంతాల్లో ఇప్పటికీ యథాతథంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్లు అమ్మకాలపై ఆధారపడ్డ కుటుంబాలు కేసీఆర్‌ను పలుమార్లు కలసి దుకాణాలు తెరిపించాలని కోరగా, ఆయన అంగీకరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లు దుకాణాలు నిర్వహించిన సొసైటీల సభ్యులు కేసీఆర్‌ను, మంత్రి పద్మారావు గౌడ్‌ను, ఎక్సైజ్ కమిషనర్ నదీం అహ్మద్‌ను కలసి దుకాణాలు తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కమిషనర్ నదీం అహ్మద్ నగరంలో పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితి... ఇప్పుడు దుకాణాలు తెరిస్తే ఎలా నిర్వహించాలన్న అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వారిచ్చిన నివేదిక మేరకే సీఎం కేబినెట్ సమావేశంలో నిర్ణయాన్ని స్పష్టం చేశారు. కాగా పదేళ్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా దుకాణాల సంఖ్యను కూడా పెంచి కల్లు విక్రయాలు సాగించాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. తద్వారా సొసైటీల సంఖ్య కూడా పెరిగి గీత కార్మిక కుటుంబాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ అంశంపై తమ అభిప్రాయాలను ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయాల్సిందిగా కోరుతూ అధికారులు అన్ని రాజకీయ పక్షాలవారికి లేఖలు పంపారు.
స్వచ్ఛమైన కల్లు విక్రయాలకే ప్రభుత్వం మొగ్గు
ఏభై కిలోమీటర్ల పరిధిలో చెట్లు లేనిచోట కల్లు విక్రయాలు జరపడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, కల్లులో ప్రమాదకరమైన రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే 2004లో హైదరాబాద్ జిల్లా పరిధిలో మూసేశారు. ఈ పరిస్థితి మరోసారి రాకుండా ఎలాంటి విధానాన్ని అవలంబించాలో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను కోరింది. కల్తీ లేని స్వచ్ఛమైన కల్లును విక్రయించేలా చూడడమే తమ ప్రభుత్వ విధానమని ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. కల్లు కాంపౌండ్‌లను తిరిగి తెరిపించడం ద్వారా గీత కుటుంబాలకు మేలు చేయడం ఎంత ముఖ్యమో... ప్రజల ఆరోగ్యం చెడిపోకుండా చూడడం అంతే అవసరమని ఆయన స్పష్టం చేశారు. నగరంలో అందరూ మెచ్చేలా కల్లు దుకాణాలు నిర్వహిస్తామని ఆయనీ సందర్భంగా తెలిపారు.