ప్రశంసాపత్రం అందుకుంటున్న సత్యనారాయణ
జ్యోతినగర్(రామగుండం): సమాజసేవలో తనవంతు పాత్ర పోషించడంతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నేనున్నాంటూ రక్తదానం చేయడంతోపాటు శిబిరాలు ఏర్పాటు చేసిన సమాజసేవకుడు బుద్ధినేని సత్యనారాయణరావుకు గవర్నర్ నరసింహన్ ఉత్తమ రక్తదాత అవార్డుతో పాటు ప్రశంసపత్రం అందజేశారు.
హైదరాబాద్‌లో గురువారం జరిగిన ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సోసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ రక్తదాతగా జూలపల్లి మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన బుద్ధినేని సత్యనారాయణరావును సత్కరించారు.
ఈయన ఎన్పీడీసీఎల్‌లో విద్యుత్ సహాయ గణాంక అధికారిగా గోదావరిఖని, పెద్దపల్లి కార్యాలయాల్లో సేవలందించారు. ప్రస్తుతం మంచిర్యాలలో విధులు నిర్వహిస్తున్నారు. 45 సార్లు రక్తదానం చేయడంతోపాటు 29 రక్తదాన శిబిరాలు నిర్వహించి 3,425 యూనిట్ల రక్తాన్ని మంచిర్యాల ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ వారికి అందించి తలసేమియా బాధితులకు ప్రాణదాతగా నిలిచారు. ఈసందర్భంగా అవార్డు అందుకున్న సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తమ రక్తదాతగా అవార్డు రావడం సంతోషంతో పాటు ఎంతో బాధ్యతను పెంచిందన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ట్రస్టును నెలకొల్పి సమాజ సేవలో తరిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment