Commendation card
-
సమాజ సేవకుడికి గవర్నర్ ప్రశంస
జ్యోతినగర్(రామగుండం): సమాజసేవలో తనవంతు పాత్ర పోషించడంతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నేనున్నాంటూ రక్తదానం చేయడంతోపాటు శిబిరాలు ఏర్పాటు చేసిన సమాజసేవకుడు బుద్ధినేని సత్యనారాయణరావుకు గవర్నర్ నరసింహన్ ఉత్తమ రక్తదాత అవార్డుతో పాటు ప్రశంసపత్రం అందజేశారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సోసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ రక్తదాతగా జూలపల్లి మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన బుద్ధినేని సత్యనారాయణరావును సత్కరించారు. ఈయన ఎన్పీడీసీఎల్లో విద్యుత్ సహాయ గణాంక అధికారిగా గోదావరిఖని, పెద్దపల్లి కార్యాలయాల్లో సేవలందించారు. ప్రస్తుతం మంచిర్యాలలో విధులు నిర్వహిస్తున్నారు. 45 సార్లు రక్తదానం చేయడంతోపాటు 29 రక్తదాన శిబిరాలు నిర్వహించి 3,425 యూనిట్ల రక్తాన్ని మంచిర్యాల ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ వారికి అందించి తలసేమియా బాధితులకు ప్రాణదాతగా నిలిచారు. ఈసందర్భంగా అవార్డు అందుకున్న సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తమ రక్తదాతగా అవార్డు రావడం సంతోషంతో పాటు ఎంతో బాధ్యతను పెంచిందన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ట్రస్టును నెలకొల్పి సమాజ సేవలో తరిస్తానని చెప్పారు. -
‘దర్యాప్తు ఆగలేదు.. కొనసాగుతోంది’
న్యూఢిల్లీ: కశ్మీర్లో రాళ్ల దాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టి ప్రశంసా పత్రాన్ని పొందిన మేజర్ నితిన్ గొగోయ్‌పై కేసు దర్యాప్తు కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. నితిన్ గొగోయ్‌కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నుంచి ప్రశంసా పూర్వకమైన అవార్డు పొందినంత మాత్రానా దర్యాప్తుపై అవార్డు ప్రభావం పడబోదని మునీర్ ఖాన్ అనే కశ్మీర్ పోలీసు అధికారి చెప్పారు. ‘దర్యాప్తు కొనసాగుతుంది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేదు. దర్యాప్తు పూర్తవ్వగానే ఆ వివరాలు తెలియజేస్తాం’ అని ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ అంటే దర్యాప్తునకు ప్రారంభం అని తర్వాత తర్కంతో కూడిన ముగింపనేది ప్రతి దర్యాప్తునకు ఉంటుందని చెప్పారు. కశ్మీర్లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల నుంచి బయటపడేందుకు, పరిస్థితిని సర్దుమణిగేలా చేసి తనతో ఉన్న సైనికులను రక్షించుకునేందుకు మేజర్ నితిన్ గొగోయ్ ఓ ఆందోళన కారుడిని జీపు బానెట్‌కు కట్టి మానవ కవచంగా తీసుకెళ్లారు. ఆయన చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నితిన్‌కు ప్రశంసా పత్రం అందజేశారు. -
ఆ ఆర్మీ ఆఫీసర్‌కు సెహ్వాగ్ స్పెషల్ మెస్సేజ్
న్యూఢిల్లీ: కశ్మీర్లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టి ప్రశంసా పత్రాన్ని పొందిన మేజర్ నితిన్ గొగోయ్‌కు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యేక సందేశం పంపించారు. ట్విట్టర్ ద్వారా నితిన్ గొగోయ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ‘కమెండేషన్ కార్డు మెడల్ పొందిన మేజర్ నితిన్ గొగోయ్‌కు అభినందనలు. మన సైనికులను కాపాడేందుకు, గొప్పగా విధులు నిర్వర్తించేలా ఎంతో గొప్పగా కృషి చేశారు’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. కశ్మీర్లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళన కారుల నుంచి బయటపడేందుకు, పరిస్థితిని సర్దుమణిగేలా చేసి తనతో ఉన్న సైనికులను రక్షించుకునేందుకు మేజర్ నితిన్ గొగోయ్ ఓ ఆందోళన కారుడుని జీపు బానెట్‌కు కట్టి మానవ కవచంగా తీసుకెళ్లారు. ఆయన చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నితిన్‌కు ప్రశంసా పత్రం అందజేశారు. Congratulations Major Nitin Gogoi for the medal of commendation. Great effort in safely rescuing our soldiers & many other wonderful duties — Virender Sehwag (@virendersehwag) 22 May 2017 -
యుద్ధం కూడా సృజనే!
యుద్ధ క్షేత్రం విధులను సృజనాత్మకతతో నిర్వర్తించాలని సైనికులకు శిక్షణలో చెబుతుంటారు. ఉద్యోగాన్ని ప్రేమించినప్పుడే సృజనాత్మక ఆలోచనలు వస్తాయంటారు కల్నల్ పి.రమేష్ కుమార్(రిటైర్డ్). మరి యుద్ధరంగంలో కొత్త ఆలోచనల అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శభాష్ అనిపించుకున్న ఈ మాజీ సైనికుడి అంతరంగం ఈవారం... మాది వరంగల్ జిల్లా. నా విద్యాభ్యాసం నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో జరిగింది. ఇంజనీరింగ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశాను. మెకానికల్ ఇంజనీర్‌గా 1986లో రక్షణరంగంలో చేరాను. ఇరవై ఆరున్నరేళ్లు పనిచేసి 2013లో రిటైరయ్యాను. ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, జమ్మూ- కశ్మీర్‌తోపాటు శ్రీలంకలోనూ పనిచేశాను. బ్లాక్ క్యాట్ కమెండోస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించాను. ట్యాంకులు, వార్ ఫైటర్స్ వంటి యుద్ధసామగ్రిని మరమ్మతు చేసి కండిషన్లో ఉంచడం మా ప్రధాన విధి. అయినప్పటికీ ఆర్మీలో అందరికీ తుపాకీ పేల్చడంలో తర్ఫీదునిస్తారు. సరిహద్దులో ఉన్నప్పుడు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామస్థులతో సత్సంబంధాలు పెంచుకోవడం చాలా ముఖ్యం. అక్కడి అవసరాలను గుర్తించి మంచినీటి సౌకర్యాల వంటి మౌలిక వసతులు కల్పించడం కూడా మా బాధ్యతే. ఒక్కొక్క బెటాలియన్ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్థులతో స్నేహంగా మెలగాలి. ఉగ్రవాద దాడుల సమాచారాన్ని పసిగట్టడానికి అనేక వ్యూహాలు అవసరం. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినట్లు గానీ, కొత్త వాళ్లు ఆ గ్రామం మీదుగా ప్రయాణించినట్లు గానీ గుర్తించిన వెంటనే గ్రామస్థులు ఆ సమాచారాన్ని మాకు చేరవేసేవాళ్లు. కుక్కలు మొరగడంతో..! ఒకసారి రాత్రి పది దాటిన తర్వాత పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల కోసం మాటు వేశాం. మూడు గంటలయినా ఎటువంటి అలికిడీ లేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో అనుకుంటూ ఆ రాత్రికి ప్రయత్నం విరమించుకున్నాం. గ్రామస్థులలో ఎవరైనా వారికి సమాచారం అందించారేమో అనే అనుమానం కూడా వచ్చింది. మరుసటి రోజు ఆకస్మికంగా వెళ్లి మాటు వేశాం. పైగా రెండు బృందాలుగా వెళ్లి రోడ్ క్రాసింగ్ దగ్గర రెండుగా చీలిపోయే చోటును దృష్టిలో ఉంచుకుని కాపలా కాశాం. వాళ్లు కూడా ప్రధాన దారిని వదిలి చుట్టూ తిరగాల్సిన దారినే ఎంచుకున్నారు. రెండు చోట్లా మా బృందాలు ఉండడంతో ఈ దఫా మా ప్రయత్నం ఫలించింది. కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. మరొకరు గాయపడి దొరికిపోయాడు. అతడిని విచారించినప్పుడు మాకు ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది. మొదటి రోజు మేము కాపు కాసిన ప్రదేశంలో కుక్కలు మొరగడంతో ఉగ్రవాదులు ప్రమాదాన్ని పసిగట్టి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సృజనాత్మకతతో చేస్తే..! ఇంజనీర్‌గా నేను గర్వంగా చెప్పుకోగలిగేది జోధ్‌పూర్‌లో జరిగింది. ఫైరింగ్ మెకానిజంలో సమస్యలు వచ్చిన ట్యాంకులు ఆరేడు నెలలుగా ఓ పక్కన ఉండిపోయాయి. అవన్నీ చిన్నపాటి స్పేర్‌పార్ట్స్ దొరికితే పనిచేయగలిగేవే. కానీ అవి విదేశాల నుంచి రావాలి. మెటల్ టెస్టింగ్ ఆపరేషన్ ద్వారా మెటీరియల్ వివరాలు, తయారీ విధానం, క్యాడ్‌కామ్ వంటి టెక్నిక్స్‌ను అధ్యయనం చేసి తక్కువ ఖర్చుతో పది ట్యాంకులను రిపేర్ చేశాం. బ్యాటిల్ ఎక్విప్మెంట్ టెస్ట్ రన్లో అవి విజయవంతంగా నిలిచాయి. కాలువలను, చిన్న నదీపాయలను దాటాల్సినప్పుడు బ్రిడ్జి ట్యాంకర్లను వాడతారు సైనికులు. వాడగా వాడగా వాటి లోహపు వంతెన అరిగి నునుపుదేలి జారుడుగా మారుతుంది. వాటి మీద ఏ వాహనం ప్రయాణించాలన్నా ప్రమాదమే. ఇనుపరాడ్లను ముక్కలు చేసి వంతెన పై భాగాన ప్రత్యేకమైన వెల్డింగ్ రాడ్‌తో అతికించాం. ఆ ఫార్ములా విజయవంతం కావడంతో, ఆ తర్వాత చాలా చోట్ల నునుపుదేలిన వంతెనలను తక్షణ వినియోగంలోకి తీసుకురావడానికి అదే పద్ధతిని అనుసరించారు. ఆ ప్రయోగం చేసినందుకు ప్రశంసాపూర్వకంగా ‘కమెండేషన్ కార్డు’ కూడా అందుకున్నాను. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి