యుద్ధం కూడా సృజనే! | Waka Manjula Reddy chit chat with Colonel p.ramesh Kumar | Sakshi
Sakshi News home page

యుద్ధం కూడా సృజనే!

Published Sun, Feb 1 2015 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

యుద్ధం కూడా సృజనే!

యుద్ధం కూడా సృజనే!

యుద్ధ క్షేత్రం
విధులను సృజనాత్మకతతో నిర్వర్తించాలని సైనికులకు శిక్షణలో చెబుతుంటారు. ఉద్యోగాన్ని ప్రేమించినప్పుడే సృజనాత్మక ఆలోచనలు వస్తాయంటారు కల్నల్ పి.రమేష్ కుమార్(రిటైర్డ్). మరి యుద్ధరంగంలో కొత్త ఆలోచనల అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శభాష్ అనిపించుకున్న ఈ మాజీ సైనికుడి అంతరంగం ఈవారం...
 
మాది వరంగల్ జిల్లా. నా విద్యాభ్యాసం నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో జరిగింది. ఇంజనీరింగ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశాను. మెకానికల్ ఇంజనీర్‌గా 1986లో రక్షణరంగంలో చేరాను. ఇరవై ఆరున్నరేళ్లు పనిచేసి 2013లో రిటైరయ్యాను. ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, జమ్మూ- కశ్మీర్‌తోపాటు శ్రీలంకలోనూ పనిచేశాను. బ్లాక్ క్యాట్ కమెండోస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించాను.

ట్యాంకులు, వార్ ఫైటర్స్ వంటి యుద్ధసామగ్రిని మరమ్మతు చేసి కండిషన్‌లో ఉంచడం మా ప్రధాన విధి. అయినప్పటికీ ఆర్మీలో అందరికీ తుపాకీ పేల్చడంలో తర్ఫీదునిస్తారు. సరిహద్దులో ఉన్నప్పుడు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామస్థులతో సత్సంబంధాలు పెంచుకోవడం చాలా ముఖ్యం. అక్కడి అవసరాలను గుర్తించి మంచినీటి సౌకర్యాల వంటి మౌలిక వసతులు కల్పించడం కూడా మా బాధ్యతే.

ఒక్కొక్క బెటాలియన్ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్థులతో స్నేహంగా మెలగాలి. ఉగ్రవాద దాడుల సమాచారాన్ని పసిగట్టడానికి అనేక వ్యూహాలు అవసరం. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినట్లు గానీ, కొత్త వాళ్లు ఆ గ్రామం మీదుగా ప్రయాణించినట్లు గానీ గుర్తించిన వెంటనే గ్రామస్థులు ఆ సమాచారాన్ని మాకు చేరవేసేవాళ్లు.
 
కుక్కలు మొరగడంతో..!

ఒకసారి రాత్రి పది దాటిన తర్వాత పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదుల కోసం మాటు వేశాం. మూడు గంటలయినా ఎటువంటి అలికిడీ లేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో అనుకుంటూ ఆ రాత్రికి ప్రయత్నం విరమించుకున్నాం. గ్రామస్థులలో ఎవరైనా వారికి సమాచారం అందించారేమో అనే అనుమానం కూడా వచ్చింది. మరుసటి రోజు ఆకస్మికంగా వెళ్లి మాటు వేశాం. పైగా రెండు బృందాలుగా వెళ్లి రోడ్ క్రాసింగ్ దగ్గర రెండుగా చీలిపోయే చోటును దృష్టిలో ఉంచుకుని కాపలా కాశాం.

వాళ్లు కూడా ప్రధాన దారిని వదిలి చుట్టూ తిరగాల్సిన దారినే ఎంచుకున్నారు. రెండు చోట్లా మా బృందాలు ఉండడంతో ఈ దఫా మా ప్రయత్నం ఫలించింది. కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. మరొకరు గాయపడి దొరికిపోయాడు. అతడిని విచారించినప్పుడు మాకు ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది. మొదటి రోజు మేము కాపు కాసిన ప్రదేశంలో కుక్కలు మొరగడంతో ఉగ్రవాదులు ప్రమాదాన్ని పసిగట్టి ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
 
సృజనాత్మకతతో చేస్తే..!
ఇంజనీర్‌గా నేను గర్వంగా చెప్పుకోగలిగేది జోధ్‌పూర్‌లో జరిగింది. ఫైరింగ్ మెకానిజంలో సమస్యలు వచ్చిన ట్యాంకులు ఆరేడు నెలలుగా ఓ పక్కన ఉండిపోయాయి. అవన్నీ చిన్నపాటి స్పేర్‌పార్ట్స్ దొరికితే పనిచేయగలిగేవే. కానీ అవి విదేశాల నుంచి రావాలి. మెటల్ టెస్టింగ్ ఆపరేషన్ ద్వారా మెటీరియల్ వివరాలు, తయారీ విధానం, క్యాడ్‌కామ్ వంటి టెక్నిక్స్‌ను అధ్యయనం చేసి తక్కువ ఖర్చుతో పది ట్యాంకులను రిపేర్ చేశాం. బ్యాటిల్ ఎక్విప్‌మెంట్ టెస్ట్ రన్‌లో అవి విజయవంతంగా నిలిచాయి.
 
కాలువలను, చిన్న నదీపాయలను దాటాల్సినప్పుడు బ్రిడ్జి ట్యాంకర్లను వాడతారు సైనికులు. వాడగా వాడగా వాటి లోహపు వంతెన అరిగి నునుపుదేలి జారుడుగా మారుతుంది. వాటి మీద ఏ వాహనం ప్రయాణించాలన్నా ప్రమాదమే. ఇనుపరాడ్లను ముక్కలు చేసి వంతెన పై భాగాన ప్రత్యేకమైన వెల్డింగ్ రాడ్‌తో అతికించాం. ఆ ఫార్ములా విజయవంతం కావడంతో, ఆ తర్వాత చాలా చోట్ల నునుపుదేలిన వంతెనలను తక్షణ వినియోగంలోకి తీసుకురావడానికి అదే పద్ధతిని అనుసరించారు. ఆ ప్రయోగం చేసినందుకు ప్రశంసాపూర్వకంగా ‘కమెండేషన్ కార్డు’ కూడా అందుకున్నాను.
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement