‘దర్యాప్తు ఆగలేదు.. కొనసాగుతోంది’
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో రాళ్ల దాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టి ప్రశంసా పత్రాన్ని పొందిన మేజర్ నితిన్ గొగోయ్‌పై కేసు దర్యాప్తు కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. నితిన్ గొగోయ్‌కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నుంచి ప్రశంసా పూర్వకమైన అవార్డు పొందినంత మాత్రానా దర్యాప్తుపై అవార్డు ప్రభావం పడబోదని మునీర్ ఖాన్ అనే కశ్మీర్ పోలీసు అధికారి చెప్పారు.
‘దర్యాప్తు కొనసాగుతుంది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయలేదు. దర్యాప్తు పూర్తవ్వగానే ఆ వివరాలు తెలియజేస్తాం’ అని ఆయన తెలిపారు. ఎఫ్‌ఐఆర్ అంటే దర్యాప్తునకు ప్రారంభం అని తర్వాత తర్కంతో కూడిన ముగింపనేది ప్రతి దర్యాప్తునకు ఉంటుందని చెప్పారు. కశ్మీర్‌లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల నుంచి బయటపడేందుకు, పరిస్థితిని సర్దుమణిగేలా చేసి తనతో ఉన్న సైనికులను రక్షించుకునేందుకు మేజర్ నితిన్ గొగోయ్ ఓ ఆందోళన కారుడిని జీపు బానెట్‌కు కట్టి మానవ కవచంగా తీసుకెళ్లారు. ఆయన చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నితిన్‌కు ప్రశంసా పత్రం అందజేశారు.