సీఎంలిద్దరూ వస్తేనే...
► విభజన విభేదాలపై గవర్నర్
► నా సమక్షంలో తీసుకున్న నిర్ణయాల అమలేదీ?
► మంత్రుల కమిటీల భేటీల తీరుపై అసంతృప్తి
► ఇలాగైతే భేటీలెందుకని సీఎంలతో వ్యాఖ్యలు
► రెండు రాష్ట్రాల చర్చలకు పీటముడి
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన వివాదాలకు పీటముడి పడింది. ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు తన సమక్షంలో మూడుసార్లు సమావేశమై తీసుకున్న నిర్ణయాల అమలుకు రెండు ప్రభుత్వాలూ ప్రయత్నించని వైనంపై ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అసం తృప్తి వ్యక్తం చేశారు. ఒక్క నిర్ణయమూ అమ లవనప్పుడు ఇక చర్చలు, సమావేశాలెందుకని ఇరు రాష్ట్రాల సీఎంలతో ఆయన ఇటీవల తన అసంతృప్తి వెలిబుచ్చినట్టు సమాచారం.
ముఖ్యమంత్రులిద్దరూ స్వయంగా హాజర య్యేంత వరకు తదుప రి చర్చలు జరిపే ప్రసక్తి లేదని, అప్పటిదాకా తన సమక్షంలో మంత్రుల కమిటీల భేటీలు కూడా లేనట్లేనని గవర్నర్ సూచనప్రాయంగా సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు విద్యుత్ బకాయిల అంశంపై రెండు రాష్ట్రాలు పోటాపోటీగా లేఖాస్త్రాలు సంధించుకోవడం, పరస్పరం సరఫరాను ఆపేసుకోవడంతో చర్చల వాతావరణానికి మరింత విఘాతం కలిగింది. ఇక గవర్నర్ సమక్షంలో మంత్రుల కమిటీ సమావేశాలు లేనట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఫలించని గవర్నర్ సయోధ్య
సచివాలయంలో ఏపీ అధీనంలో ఉన్న భవనా లను తమకు అప్పగించాలని గత జనవరిలో రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. విభజ నతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో దీన్ని గవర్నర్‌కు పంపింది. ఆయన ప్రత్యేక చొరవ చూపి ఏపీ ప్రభుత్వంతో రాయబారం నెరిపా రు. ‘‘ప్రభుత్వ భవనాల పంపిణీ, అప్పగింత లతో పాటు పెండింగ్ వివాదాలన్నిటినీ పరి ష్కరించుకోండి. ఇందుకోసం ఇరు రాష్ట్రాల మంత్రులతో కమిటీ వేసి నా సమక్షంలో చర్చించండి’’ అని సూచించారు.
ఆ మేరకు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఏపీ నుంచి యనమల రామకృష్ణుడు, కె.అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు సభ్యులుగా కమిటీలు ఏర్పడ్డా యి. గత ఫిబ్రవరి, మార్చిల్లో రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో మూడుసార్లు చర్చలు జరిపాయి. పలు వివాదాలు ప్రస్తావనకు వచ్చినా ఒక్క అంశమూ పరిష్కారానికి నోచు కోలేదు. సచివాలయ భవనాల అప్పగింత, విద్యుత్తు ఉద్యోగుల విభజన, పెండింగ్‌లో ఉన్న తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజనతో పాటు ఉద్యోగుల విభజనపై చర్చలు సాగాయి. సచివాలయ భవనాలను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేయాలని తెలంగాణ పట్టుబట్టగా, తమ సీఎంతో మాట్లాడి చెబుతామంటూ ఏపీ దాటవేసింది.
మంత్రుల సమావేశానికి విముఖత!
విద్యుత్ ఉద్యోగుల పంపిణీ సమ స్యలపై రెండు రాష్ట్రాల సీఎండీలు మా ట్లాడుకొని, వారి నివేదికల ఆధారంగా పరిష్కరించుకునేందుకు కమిటీలు అంగీ కరించినా కార్యాచరణ లేకపోయింది. విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని 42 సంస్థలపై ఏకాభిప్రా యం వచ్చిందని కమిటీలు వెల్లడించినా ఏపీ ప్రభుత్వం సంబంధిత జీవోలు జారీ చేయలేదు.
ఇవన్నీ గవర్నర్ దృష్టికి వెళ్లా యి. ఇలాగైతే అసలు ఈ సమావేశాలతో లాభమేమిటని ఆయన భావిస్తున్నట్లు రాజభవన్ వర్గాలు చెపుతున్నాయి. దీనికి తోడు విభజన సమస్యల పరిష్కారంలో గవర్నర్ విఫలమయ్యారనే ప్రచారమూ మొదలైంది. దాంతో తదుపరి మంత్రుల సమావేశాన్ని నిర్వహించేందుకు ఆయన విముఖంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చివరికి, మిగతా రూ.17వేల కోట్ల అప్పుల పంపిణీ వ్యవహారంలోనూ పీట ముడి పడింది. వివాదాన్ని తేల్చాలంటూ ఇరు రాష్ట్రాలు ఏకంగా కేంద్ర హోంశాఖకు లేఖలు రాశాయి. గవర్నర్ వద్ద భేటీలు కొనసాగి ఉంటే పెండింగ్ పేచీలు ఇంత దూరం వెళ్లేవి కావనే అభిప్రాయాలున్నాయి.