
యూత్ యాజ్ టార్చ్ బేరర్స్ ఆఫ్ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్ ఇన్ సౌతిండియా సదస్సులో ఉత్పత్తులను పరిశీలిస్తున్న గవర్నర్ తమిళిసై, మంత్రి నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా ముందుకెళ్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. రాష్ట్ర రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని కితాబిచ్చారు. రైతు అయిన నిరంజన్‌రెడ్డి వ్యవసాయమంత్రిగా ఉండటం వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే జోగుళాంబ ఆలయాన్ని, మంత్రి మామిడితోటను సందర్శిస్తానని చెప్పారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘యూత్ యాజ్ టార్చ్ బేరర్స్ ఆఫ్ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్ ఇన్ సౌతిండియా’సదస్సును ఆమె సోమవారం ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగుతోంది. రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు, వ్యవసాయరంగ సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు .
వ్యవసాయం వైపు యువతను మరింత ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెలలో జరగనున్న గవర్నర్ల సదస్సులో తాను వ్యవసాయం అంశంపై మాట్లాడుతానని పేర్కొన్నారు. తెలంగాణ జనాభాలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండి, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలెన్నో అమలు చేస్తోందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అగ్రికల్చర్ ఇన్నొవేషన్ ఫండ్’ఏర్పాటు చేయాలని ‘ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్’చైర్మన్ ఆర్.ఎస్.పరోడా అన్నారు. వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు వర్క్‌షాప్ స్వాగతోపన్యాసం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment