
సాక్షి, హైదరాబాద్: ‘మందు’ సొమ్మే సర్కారు బండికి ఇంధనం కాబోతోంది! నిధుల సమీకరణకు ప్రభుత్వం మందు సీసానే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకుంది. ఈ ఏడాది మద్యం వ్యాపారం ద్వారా రూ.11 వేల కోట్లు, స్పిరిట్ ఆధారిత ఉత్పత్తుల అనుమతి, ఇతర రశీదుల ద్వారా రూ.3,500 కోట్లు.. వెరసి కనీసం రూ.14.5 వేల కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఎలైట్ బార్లు.. ఎన్నైనా..
దుకాణాలకు దరఖాస్తులు, లైసెన్స్ ఫీజుతోపాటు మద్యం విక్రయాలతో భారీగా ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సాధారణ బార్లకు అనుమతులు తగ్గించి వాటి స్థానంలో అదనపు లైసెన్స్ ఫీజు వచ్చే ఎలైట్ బార్లకు ఎక్కువ సంఖ్యలో లైసెన్స్‌లు కేటాయించాలని నిర్ణయించింది. నగరాలు, పట్టణాల్లో కోరినంత మందికి ఎలైట్ బార్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు అమల్లో ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2,215 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు విక్రయించటం ద్వారా రూ.1,675 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.401 కోట్లు దరఖాస్తుల ద్వారా, రూ.1,274 కోట్లు లైసెన్సుల ద్వారా వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 820 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా గతేడాది రూ 356.90 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కొత్తగా ఎలైట్ బార్ల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో సాధారణ బార్ల లైసెన్స్ ఫీజుపై అదనంగా 25 శాతం కట్టి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎలైట్ బార్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మొత్తానికి బార్ల ద్వారా రూ.421 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్ణయించారు. వీటి ద్వారా ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని, ఇందులో 283.20 లక్షల కేసుల బ్రాందీ, విస్కీ, 349.42 లక్షల కేసుల బీరు, 82 వేల కేసుల విదేశీ మద్యం విక్రయించడం ద్వారా రూ.15,836 కోట్ల విలువైన మద్యం వ్యాపారం చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో వ్యాపారులకు ట్రేడ్ మార్జిన్, ఉత్పత్తి సంస్థలకు బేసిక్ ధర, ఇతర ఖర్చులుపోను నికరంగా రూ.9,020 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. స్పిరిట్ ఆధారిత ఉత్పత్తులకు అనుమతుల ద్వారా రూ.3,500 కోట్ల ఆర్జన లక్ష్యంగా ఎంచుకున్నారు.
ఆ దుకాణాల బదిలీతో 30 కోట్లు!
2011 ఎక్సైజ్ పాలసీలో జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని మద్యం దుకాణాలకు లైసెన్స్ ఫీజు రూ.1.04 కోట్లుగా నిర్ధారించారు. ఈ ఫీజు భారంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 72 మద్యం దుకాణాలకు గత ఏదేళ్ల నుంచి ఒక్క దరఖాస్తు రాలేదు. దీంతో తాజా పాలసీలో ఈ మద్యం దుకాణాలను వేర్వేరు జిల్లాలకు కేటాయించారు. వీటిలో 50 శాతం దుకాణాలను మేడ్చల్, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలకు కేటాయించారు. మిగిలిన 50 శాతం దుకాణాలను జిల్లాకు ఒకటి రెండు చొప్పున ఇచ్చారు. వీటి ద్వారా కనీసం రూ.30 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్టు ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. గతంలో మిగిలిపోయిన దుకాణాల్లో కొన్నింటిని టీఎస్‌బీసీఎల్ నిర్వహించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మార్పీ ఉల్లంఘన, అక్రమ మద్యాన్ని నివారించేందుకు టీఎస్‌బీసీఎల్ 22 ఔట్‌లెట్లను తెరిచి రిటైల్ ధరకే మద్యం విక్రయించింది. కానీ ఇందులో పెద్దగా లాభాలు రాకపోవటంతో ఈ ఏడాది ప్రభుత్వం ఔట్‌లెట్లను ఎత్తేసింది.
2017–18లో మద్యం విక్రయాల అంచనా ఇదీ..
మద్యం రకం లక్షల కేసులు
సాధారణం 37.56
మీడియం 125.19
ప్రీమియం 120.46
విదేశీ 0.82
బీరు 349.42
మొత్తం వ్యాపారం 15,836 (రూ.కోట్లు)
ఆదాయం అంచనాలు
(రూ.కోట్లలో)
ఎక్సైజ్ వ్యాట్ 8,021
ప్రివిలేజ్ ఫీజు 780
క్రీడల ప్రమోషన్ ఫీజు 9.56
సీఎంఆర్‌ఎఫ్ 210
దరఖాస్తులతో 401
వైన్‌షాప్ లైసెన్స్‌లు 1,274
బార్ల లైసెన్స్ 421
స్పిరిట్ ఆధారిత ఉత్పత్తులకు
అనుమతులు, ఇతర రశీదులు 3,500
మొత్తం 14,616.56