ఆస్పత్రి ఉండేది ఇలాగేనా?
డిచ్‌పల్లి : ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొడితే సహించేది లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఇందల్వాయి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ) మంత్రి తనిఖీ చేశారు. ఆ సమయంలో పీహెచ్‌సీలో కేవలం ఫార్మాసిస్ట్ సంపత్‌లక్ష్మి మాత్రమే ఉన్నారు. ఉదయం 11 గంటలు దాటినా పీహెచ్‌సీ వైద్యురాలు అశ్విని విధులకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫోన్ చేసి ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ బసవేశ్వరిని పీహెచ్‌సీకి రప్పించారు. ఇది ‘ప్రభుత్వ ఆస్పత్రా.. లేక ప్రైవేటు దుకాణామా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్య సిబ్బంది ఇలా ఉంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పీహెచ్‌సీ ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్ట్రర్‌ను తనిఖీ చేయగా అందులో మూడు రోజులుగా సంతకాలు లేకపోవడాన్ని గమనించి ఇదేనా మీ శాఖ పని తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నారం, తిర్మన్‌పల్లి గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోగులకు అందుబాటులో ఉండాల్సిన ఏఎన్‌ఎంలు, సెకండ్ ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండటం లేదని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అస్పత్రికి చెందిన ఏఎన్‌ఎం అరుంధతి, సూపర్‌వైజర్ కాడయ్య నిజామాబాద్‌లో శిక్షణ కోసం వెళ్లినట్లు మూవ్‌మెంట్ రిజిష్టర్‌లో నమోదు చేసి ఉండటాన్ని గమనించిన మంత్రి.. శిక్షణ కేంద్రానికి ఫోన్ చేసి వాకబు చేశారు. అక్కడ పై ఇరువురు లే రని సమాధానం రావడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే..
గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు, బాలింతలు వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మూలంగానే చనిపోతున్నారని మంత్రి ఆరోపించారు. సమయ పాలన పాటిస్తూ రోగులకు సరైన సేవలందించి వృత్తికి న్యాయం చేయూలని సూచించారు. మంత్రి వచ్చిన విషయం తెలుసుకుని పీహెచ్‌సీకి చేరుకున్న డాక్టర్ అశ్వినిపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. చెత్తా చెదారం ఉండటాన్ని గమనించి మంత్రి నివ్వెరపోయారు. ‘ఇది ఆస్పత్రేనా లేక కూరగాయల దుకాణమా’ అంటూ మండిపడ్డారు. రోగులు ఇక్కడికి వస్తే రోగం తగ్గదని, ఇంకా పెరుగుతుందని అన్నారు.
‘ట్రామాకేర్’ ఏర్పాటుకు కృషి..
ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయనను ఇందల్వాయి సర్పంచ్ పాశం కుమార్, తిర్మన్‌పల్లి సర్పంచ్ చాంగీబాయి, ఎంపీటీసీ సభ్యుడు షేక్ హుస్సేన్ తదితరులు కలిసి ట్రామా కేర్ సెంటర్ విషయూన్ని ప్రస్తావించారు. 44వ నంబరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అంది ప్రాణాలు దక్కే అవకాశాలుంటాయని వివరించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్కొన్నారు. పీహెచ్‌సీ చుట్టూ ప్రహరీ నిర్మాణం, కొత్త ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామన్నారు.