Govt hospital doctors
-
మగబిడ్డకు జన్మ.. అంతలోనే విషాదం
కర్ణాటక , హొసూరు : హొసూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. హోసూరు సమీపంలోని తొడుదేపల్లి గ్రామానికి చెందిన దేవరాజ్ భార్య పవిత్ర (21) నిండు గర్భిణి. ఈనెల 3వ తేదీన ఆమె ప్రసవం కోసం హొసూరు ప్రభుత్వం ఆస్పత్రిలో చేరింది. ఆదివారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అయితే రాత్రి 7 గంటల సమయంలో పవిత్ర మృతి చెందింది. విషయం తెలుసుకొన్న బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి భూపతి, డీఎస్పీ మురళీ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రసవం అనంతరం పవిత్రకు నొప్పులు ఎక్కువ కావడంతో మృతి చెందిందని వారికి వివరించారు. ఇదిలా ఉంటే ఇటీవల హొసూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. -
చర్చలకు సీఎం ఆసుపత్రికి రావాలి
న్యూఢిల్లీ/కోల్‌కతా: ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమకు రక్షణ కల్పించాలని వైద్యులు, జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైద్యులను బుజ్జగించేందుకు సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తమ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రే స్వయంగా కోల్‌కతాలోని నీల్‌రతన్ సిర్కర్(ఎన్ఆర్ఎస్) వైద్యకళాశాలకు రావాలని కోరారు. ‘సీఎంతో సమావేశానికి మా ప్రతినిధులను పంపడం లేదు. ఎందుకంటే వారి భద్రత విషయంలో మాకు భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి మా వైద్యుడిపై ఓ రోగి బంధువులు దాడి చేసిన ఎన్ఆర్ఎస్ ఆసుపత్రికి సీఎంను ఆహ్వానిస్తున్నాం’ అని ఓ డాక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంవైపు నుంచి ప్రయత్నాలు నిజాయితీగా సాగడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బెంగాల్లో 300 మందికిపైగా డాక్టర్లు రాజీనామా చేశారు. వీరికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు సంఘీభావం తెలియజేశారు. కేంద్రం ఆందోళన.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ హింస, డాక్టర్ల ధర్నాపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు ఘటనలపై వేర్వేరుగా నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ శనివారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘మాకు అందిన నివేదికల ప్రకారం 2016లో పశ్చిమబెంగాల్లో 509 హింసాత్మక ఘటనలు నమోదుకాగా, 2018 నాటికి ఆ సంఖ్య 1,035కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏకంగా 773 హింసాత్మక ఘటనలు జరిగాయి. అదేసమయంలో ఇలాంటి దుర్ఘటనల్లో చనిపోయినవారి సంఖ్య 2018 నాటికి అది 96కు పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 26 మంది హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని కేంద్ర హోంశాఖ తెలిపింది. బెంగాల్లో హింసను అరికట్టడానికి ఏమేం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ప్రత్యేక చట్టం రూపొందించండి.. ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా ప్రత్యేకంగా చట్టాలను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాలకు సూచిస్తూ లేఖ రాశారు ఈ లేఖకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రూపొందించిన ‘వైద్యసేవల సిబ్బంది, వైద్యసంస్థల రక్షణ ముసాయిదా బిల్లు–2017’ను జతచేశారు. భారత వైద్యులు ప్రపంచంలోనే అత్యున్నత నిపుణులుగా గుర్తింపు పొందారనీ, వారు తీవ్రమైన ఒత్తిడిలో, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. విధుల్లో చేరండి: మమత పశ్చిమబెంగాల్లో ఆందోళన చేస్తున్న వైద్యుల అన్ని డిమాండ్లను అంగీకరిస్తున్నామని, అవసరమైతే ఇంకా మరిన్ని డిమాండ్లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం మమత చెప్పారు. ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ‘వైద్యులు, జూనియర్ డాక్టర్లు గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవల చట్టం(ఎస్మా)ను ప్రయోగించలేదు. చర్యలు తీసుకోవడం ద్వారా జూనియర్ డాక్టర్ల కెరీర్‌ను నాశనం చేయాలని మేం భావించడం లేదు. వైద్యులతో శుక్రవారం చర్చించేందుకు నేను 5 గంటలు ఎదురుచూశా. శనివారం నా అధికారిక కార్యక్రమాలు అన్నింటిని రద్దుచేసుకున్నా.ఒకవేళ నాతో చర్చించడం ఇష్టం లేకపోతే గవర్నర్ లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా పోలీస్ కమిషనర్‌తో నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు’ అని స్పష్టం చేశారు. -
ఆస్పత్రి ఉండేది ఇలాగేనా?
డిచ్పల్లి : ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొడితే సహించేది లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఇందల్వాయి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) మంత్రి తనిఖీ చేశారు. ఆ సమయంలో పీహెచ్సీలో కేవలం ఫార్మాసిస్ట్ సంపత్లక్ష్మి మాత్రమే ఉన్నారు. ఉదయం 11 గంటలు దాటినా పీహెచ్సీ వైద్యురాలు అశ్విని విధులకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫోన్ చేసి ఇన్చార్జి డీఎంహెచ్ఓ బసవేశ్వరిని పీహెచ్‌సీకి రప్పించారు. ఇది ‘ప్రభుత్వ ఆస్పత్రా.. లేక ప్రైవేటు దుకాణామా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది ఇలా ఉంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పీహెచ్సీ ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్ట్రర్‌ను తనిఖీ చేయగా అందులో మూడు రోజులుగా సంతకాలు లేకపోవడాన్ని గమనించి ఇదేనా మీ శాఖ పని తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నారం, తిర్మన్‌పల్లి గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోగులకు అందుబాటులో ఉండాల్సిన ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు అందుబాటులో ఉండటం లేదని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అస్పత్రికి చెందిన ఏఎన్ఎం అరుంధతి, సూపర్వైజర్ కాడయ్య నిజామాబాద్‌లో శిక్షణ కోసం వెళ్లినట్లు మూవ్మెంట్ రిజిష్టర్‌లో నమోదు చేసి ఉండటాన్ని గమనించిన మంత్రి.. శిక్షణ కేంద్రానికి ఫోన్ చేసి వాకబు చేశారు. అక్కడ పై ఇరువురు లే రని సమాధానం రావడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓను ఆదేశించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే.. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు, బాలింతలు వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మూలంగానే చనిపోతున్నారని మంత్రి ఆరోపించారు. సమయ పాలన పాటిస్తూ రోగులకు సరైన సేవలందించి వృత్తికి న్యాయం చేయూలని సూచించారు. మంత్రి వచ్చిన విషయం తెలుసుకుని పీహెచ్‌సీకి చేరుకున్న డాక్టర్ అశ్వినిపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. చెత్తా చెదారం ఉండటాన్ని గమనించి మంత్రి నివ్వెరపోయారు. ‘ఇది ఆస్పత్రేనా లేక కూరగాయల దుకాణమా’ అంటూ మండిపడ్డారు. రోగులు ఇక్కడికి వస్తే రోగం తగ్గదని, ఇంకా పెరుగుతుందని అన్నారు. ‘ట్రామాకేర్’ ఏర్పాటుకు కృషి.. ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయనను ఇందల్వాయి సర్పంచ్ పాశం కుమార్, తిర్మన్‌పల్లి సర్పంచ్ చాంగీబాయి, ఎంపీటీసీ సభ్యుడు షేక్ హుస్సేన్ తదితరులు కలిసి ట్రామా కేర్ సెంటర్ విషయూన్ని ప్రస్తావించారు. 44వ నంబరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అంది ప్రాణాలు దక్కే అవకాశాలుంటాయని వివరించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్కొన్నారు. పీహెచ్సీ చుట్టూ ప్రహరీ నిర్మాణం, కొత్త ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామన్నారు.