చర్చలకు సీఎం ఆసుపత్రికి రావాలి | West Bengal doctors strike fifth day | Sakshi
Sakshi News home page

చర్చలకు సీఎం ఆసుపత్రికి రావాలి

Published Sun, Jun 16 2019 4:34 AM | Last Updated on Sun, Jun 16 2019 4:34 AM

West Bengal doctors strike fifth day - Sakshi

కోల్‌కతాలోని ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగిన జూనియర్‌ డాక్లర్లు

న్యూఢిల్లీ/కోల్‌కతా: ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమకు రక్షణ కల్పించాలని వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైద్యులను బుజ్జగించేందుకు సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తమ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రే స్వయంగా కోల్‌కతాలోని నీల్‌రతన్‌ సిర్కర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌) వైద్యకళాశాలకు రావాలని కోరారు. ‘సీఎంతో సమావేశానికి మా ప్రతినిధులను పంపడం లేదు. ఎందుకంటే వారి భద్రత విషయంలో మాకు భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి మా వైద్యుడిపై ఓ రోగి బంధువులు దాడి చేసిన ఎన్‌ఆర్‌ఎస్‌ ఆసుపత్రికి సీఎంను ఆహ్వానిస్తున్నాం’ అని ఓ డాక్టర్‌ తెలిపారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంవైపు నుంచి ప్రయత్నాలు నిజాయితీగా సాగడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బెంగాల్‌లో 300 మందికిపైగా డాక్టర్లు రాజీనామా చేశారు. వీరికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు సంఘీభావం తెలియజేశారు.

కేంద్రం ఆందోళన..
పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ హింస, డాక్టర్ల ధర్నాపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు ఘటనలపై వేర్వేరుగా నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ శనివారం బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘మాకు అందిన నివేదికల ప్రకారం 2016లో పశ్చిమబెంగాల్‌లో 509 హింసాత్మక ఘటనలు నమోదుకాగా, 2018 నాటికి ఆ సంఖ్య 1,035కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏకంగా 773 హింసాత్మక ఘటనలు జరిగాయి. అదేసమయంలో  ఇలాంటి దుర్ఘటనల్లో చనిపోయినవారి సంఖ్య  2018 నాటికి అది 96కు పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 26 మంది హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని కేంద్ర హోంశాఖ తెలిపింది. బెంగాల్‌లో హింసను అరికట్టడానికి ఏమేం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు.

ప్రత్యేక చట్టం రూపొందించండి..
ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా ప్రత్యేకంగా చట్టాలను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ రాష్ట్రాలకు సూచిస్తూ లేఖ రాశారు ఈ లేఖకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రూపొందించిన ‘వైద్యసేవల సిబ్బంది, వైద్యసంస్థల రక్షణ ముసాయిదా బిల్లు–2017’ను జతచేశారు.  భారత వైద్యులు ప్రపంచంలోనే అత్యున్నత నిపుణులుగా గుర్తింపు పొందారనీ, వారు తీవ్రమైన ఒత్తిడిలో, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు.

విధుల్లో చేరండి: మమత
పశ్చిమబెంగాల్‌లో ఆందోళన చేస్తున్న వైద్యుల అన్ని డిమాండ్లను అంగీకరిస్తున్నామని, అవసరమైతే ఇంకా మరిన్ని డిమాండ్లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం మమత చెప్పారు. ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ‘వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవల చట్టం(ఎస్మా)ను ప్రయోగించలేదు. చర్యలు తీసుకోవడం ద్వారా జూనియర్‌ డాక్టర్ల కెరీర్‌ను నాశనం చేయాలని మేం భావించడం లేదు. వైద్యులతో శుక్రవారం చర్చించేందుకు నేను 5 గంటలు ఎదురుచూశా. శనివారం నా అధికారిక కార్యక్రమాలు అన్నింటిని రద్దుచేసుకున్నా.ఒకవేళ నాతో చర్చించడం ఇష్టం లేకపోతే గవర్నర్‌ లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా పోలీస్‌ కమిషనర్‌తో నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు’ అని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement