‘గ్రామజ్యోతి’ వెలగాలి
ఈ యజ్ఞంలో అధికారులే కీలకం
- మండలానికో ‘ఛేంజ్ ఏజెంట్’ కావాలి
- 15న లాంఛనంగా ప్రారంభం 17 నుంచి యాక్షన్‌ప్లాన్ షురూ కావాలి
- కలెక్టర్, ఎస్‌పీ, జేసీతో సీఎం కేసీఆర్
- సమీక్షలో అంకాపూర్ పేరు ప్రస్తావన
- పుష్కరాలు బాగా నిర్వహించారని కితాబు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆగస్టు 15న ప్రారంభించే ‘గ్రామజ్యోతి’ పల్లెల సమగ్రాభివృద్ధికి వేదిక కావాలని, ఇందుకోసం జిల్లాస్థాయి అధికారులు అంకితభావంతో పని చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం విజయవంతంలో అధికారులే కీలకం కావాలన్నారు. ప్రతీ గ్రామంలో ప్రజల భాగస్వామ్యం ఉండే లా చూడాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గ్రామజ్యోతిపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమా వేశానికి జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్‌పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, జడ్‌పీ సీ ఈఓ మోహన్‌లాల్, డీపీఓ కృష్ణమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా, ఎవరి ఇంటి అభివృద్ది కోసం వాళ్లు ప్రణాళికలు సిద్దం చేసుకున్నటు,్ల ఎవరి ఊరి అభివృద్ధికి వారే ప్రణాళికలు సిద్ధం చేసుకునే విధంగా ప్రజలను సమాయత్తం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గ్రామజ్యోతి అంటే గ్రామాలకు నిధులు కేటాయించడం కాదు, అందులో ప్రతీ పౌరుడిని భాగస్వామిని చేయడమేనన్నారు. మొదటి దశలో ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో గ్రామాలు ఉండే విధంగా ప్రజలు సంఘటిత శక్తితో పనిచేయాలని కోరారు. గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. ఏ గ్రామానికి ఏ సదుపాయం కావాలో దాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.
పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తి తేవాలి
పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తిని మళ్లీ తీసుకు రావాలని అధికారులను కేసీఆర్ కోరారు. ప్రజలను భాగస్వాములను చేసి దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మార్పులు సాధించాలన్నారు. అవసరాన్ని బట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు నడపాలన్నారు. ప్రజల సంఘటిత శక్తిలోని బలమేంటో గుర్తించాల న్నారు.
ఏ ఊరుకు ఆ పూరు ప్రణాళిక సిద్దం చేసుకునేలా ప్రజలకు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అంకాపూర్ పేరును ప్రస్తావించిన సీఎం కేసీ ఆర్.. అన్ని జిల్లాల అధికారులు అన్ని గ్రామాలను అంకాపూర్‌లా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభించే గ్రామజ్యోతిలో భాగంగా అధికారులు 17 నుంచి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. 17 నుంచి 24 వరకు ప్రతీగ్రామంలో పారిశ్యుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెత్త, దుర్గంధం లేని గ్రామాలను చూడాలన్నారు. జిల్లాలో ఉండే అధికారులు మండలానికొకరు ఛేంజ్ ఏజెంట్స్‌గా వ్యవహరించాలని కోరారు.