జయ జయహే తెలంగాణ..
పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా రాష్ట్రావతరణ వేడుకలు
కళాకారుల ఆటాపాటా, వివిధ శాఖల శకటాల ప్రదర్శన
ఆకట్టుకున్న పోలీస్ కవాతు.. వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్ 52 మందికి సన్మానం..
హైదరాబాద్: లయబద్ధంగా డప్పు వాయిద్యాలు.. గిరిజన సంస్కృతిని చాటే డోల్ దెబ్బ విన్యాసాలు.. ఊపునిచ్చే చప్పుళ్లకు అనుగుణంగా బంజారా నృత్యాలు.. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బోనాలు, బతకమ్మల ఊరేగింపు.. మత సామరస్యానికి అద్దంపట్టే పీర్ల పలకరింపు.. ఆధునిక హంగులు సంతరించుకున్న పోలీసు బృందాల కవాతు.. బంగారు తెలంగాణకు బాటలు పరుస్తూ ప్రభుత్వ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను ప్రతిబింబించే అందమైన శకటాలు.. ‘తెలంగాణ రాష్ట్రం’ పేరు వినిపించగానే ఆహూతుల్లో పులకరింత.. మన రాష్ర్టం-మన పాలన అనుకుంటూ ఉప్పొంగిన గుండెలు.. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం ఆవిష్కృతమైన దృశ్యమాలిక ఇది. రాష్ట్రావతరణ వేడుకలను రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ఘనంగా ప్రారంభించింది. తొలి వార్షికోత్సవ వేళ రాష్ట్రం నలుమూలలా పండుగ వాతావరణం నెలకొంది. పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సీఎం కేసీఆర్ ఈ వేడుకలను ప్రారంభించారు.
అంగరంగ వైభవంగా...
ఉదయం తొమ్మిది గంటలకు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించి పరేడ్‌మైదానానికి చేరుకున్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అదనపు డీజీపీ త్రివేది నేతృత్వంలో వివిధ బెటాలియన్లు లయబద్ధంగా నిర్వహించిన కవాతు విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న సాంస్కృతిక సారథి సభ్యులు ఆటపాటతో అబ్బురపరిచారు. 550 మంది కళాకారులు సాంస్కృతిక కవాతు నిర్వహించారు. ‘సారథి’ చైర్మన్ రసమయి బాలకిషన్ ముందు నడవగా కళాకారుల బృందాలు డప్పు వాయిద్యాల మధ్య ఆడిపాడుతూ ముందుకుసాగారు. పురుషులు గులాబీ రంగు చొక్కాలు, ధోవతి ధరించగా... మహిళలు ఆకుపచ్చరంగు చీరల్లో మెరిశారు. బతుకమ్మలు, బోనాలు, పీర్లు, బంజారా నృత్యాలు, డ ప్పు చప్పుళ్లు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అందంగా ముస్తాబైన శకటాలు
ఇక ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు భావి ‘బంగారు తెలంగాణ’ను ఆవిష్కరించాయి. తొలుత సమాచార శాఖ శకటాన్ని ప్రదర్శించారు. అమరవీరుల స్థూపం, కాకతీయతోరణ నమూనాలు ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ శకటం, గ్రామీణ నీటిపారుదల శాఖ స్వచ్ఛ భారత్ శకటం, నేలతల్లి కల్పవల్లి పేరుతో వ్యవసాయ శాఖ శకటం, పౌరసరఫరాల శాఖ శకటం, అటవీ శాఖ హరితహారం శకటం ముందుకు సాగాయి. షాదీ ముబారక్‌తో మైనారిటీ సంక్షేమ శాఖ శకటం, గిరిజన శాఖ కొమురం భీం శకటం, దేవాదాయ శాఖ యాదాద్రి శకటం, పర్యాటక శాఖ గోల్కొండ కోట శకటం అలరించాయి. రోడ్లు భవనాల శాఖ, మెట్రో రైలు శకటాలు ప్రత్యేకంగా నిలిచాయి. స్వచ్ఛ హైదరాబాద్ నినాదంతో జీహెచ్‌ఎంసీ శకటం, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యమిస్తూ చీపురు ఆకృతిలోని వాహనం ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ చివరగా భారీ వాహన కాన్వాయ్‌తో ప్రత్యేకతను చాటుకుంది. మెట్రో రైలు శకటం ప్రథమ బహుమతిని, అటవీ శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ శకటాలు రెండు, మూడో బహుమతులను దక్కించుకున్నాయి. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రతిభావంతులను ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. 32 రంగాలకు చెందిన 52 మందికి లక్షా నూటపదహార్ల నగదు పురస్కారాన్ని, పోచంపల్లి శాలువా, పెంబర్తిలో రూపొందిన జ్ఞాపికలను అందజేశారు.
అసెంబ్లీలో అవతరణోత్సవాలు
అసెంబ్లీలోనూ రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులు అర్పించారు. శాసన మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో హోం మంత్రి నాయిని జెండాను ఆవిష్కరించారు.