
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన వీరహనుమాన్ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో, కాషాయవర్ణ శోభిత నిలువెత్తు హనుమాన్ జెండాలతో నిర్వహించిన ప్రదర్శన ఉత్సాహంగా సాగింది.విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు నగరం నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. గౌలిగూడ రామమందిర్‌లో యజ్ఞం నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యఅధ్యక్షుడు అలోక్‌కుమార్, కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శి వినాయక్‌దేశ్ పాండేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రకుట్ స్వామి రామ హృదయ్‌దాస్, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద వేలాదిమంది హనుమాన్ భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులు హనుమంతుడి జెండాను చేతబూని గౌలిగూడ నుంచి తాడ్‌బంద్‌వరకు ర్యాలీగా తరలి వెళ్లారు.శోభాయాత్ర ఉత్తేజభరితంగా, ప్రశాంతంగా సాగింది.
భారీ బందోబస్తు......
గౌలిగూడ రామమందిర్ నుంచి సాగిన శోభాయాత్రకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.అడుగడుగునా సీసీ కెమెరాలతో గట్టి నిఘాను ఉంచారు.
రామ మందిరం పనులు ప్రారంభిస్తాం : అలోక్‌కుమార్
వీరహనుమాన్ శోభాయాత్రలో భాగంగా కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికలో వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యఅధ్యక్షుడు అలోక్‌కుమార్ స్వామి రామ హృదయ్‌దాస్, వినాయక్ దేశ్‌పాండేలు మాట్లాడారు. ఏడాదిలోపు అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు యువశక్తిలోని ఐక్యతను చాటాయని, ఇంది ఎంతో శుభసూచకమన్నారు. ఈ శోభాయాత్ర అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. దుష్టశక్తుల నాశనానికి ఇలాంటి ఐక్యత అవసరమన్నారు. గతంలో ఎలాంటి ఆయుధాలు , డైనమెట్ లేకుండా చేతులతోనే అయోధ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేశామని గుర్తు చేశారు. హైదరాబాద్ హిందూ ప్రజల ఐక్యత ఉందనడానికి నిదర్శనం ఈ శోభాయాత్రనే అన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామదాస్, బజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, నేతలు గాల్‌రెడ్డి, కైలాశ్, ముఖేష్‌లతో పాటు స్థానిక నాయకులు డాక్టర్ భగవంత్‌రావు, యమన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment