నాగోల్‌–హైటెక్‌సిటీ: మెట్రోలో 55 నిమిషాలే! | Green signal to high tech city metro | Sakshi
Sakshi News home page

హైటెక్‌ సిటీ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్‌!

Published Tue, Mar 19 2019 2:36 AM | Last Updated on Tue, Mar 19 2019 9:45 AM

Green signal to high tech city metro - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ఈ నెల 20న (బుధవారం) హైటెక్‌ సిటీకి పరుగులు పెట్టనుంది. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఉదయం 9.30 గంటలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి హైటెక్‌ సిటీకి మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొందరు ఉన్నతాధికారులు, ఎల్‌అండ్‌టీ, మెట్రో ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు రైలు అందుబాటులోకి రానుంది. 18 నిమిషాల్లో అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ చేరుకోవచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి సింగిల్‌ట్రాక్‌లో మెట్రోరైలు హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి రానుంది. దీంతో చెక్‌పోస్ట్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు వేగం కాస్త తగ్గే అవకాశం ఉంది. కాగా ఇక నాగోల్‌–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రోలో 55 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. అదే బస్సు లేదా కారులో అయితే దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది.

10కి.మీ 9 స్టేషన్లు..
అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కి.మీ. దూరంలో 9 స్టేషన్లున్నాయి. ప్రధానంగా అమీర్‌పేట్, తరుణి–మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెర్వు, హైటెక్‌ సిటీ స్టేషన్లున్నాయి. తరుణి మధురానగర్‌ స్టేషన్‌లో మహిళలు, చిన్నారుల అవసరాల కోసం అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచారు. దీని కోసం ఈ స్టేషన్‌ ప్రాంగణంలో సుమారు 2 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించడం విశేషం. దేశంలో ఇలాంటి సౌకర్యాలున్న మెట్రోస్టేషన్‌ ఇదేనని అధికారులు తెలిపారు. మిగతా మెట్రో స్టేషన్లు రెండంతస్తుల్లో ఉండగా, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌ మాత్రం ట్రాఫిక్‌ ఇబ్బందుల రీత్యా ఒకే అంతస్తులో నిర్మించారు. ఈ మార్గంలో రహదారులు పలు మలుపులు తిరిగి ఉండటంతో అనేక ఇంజనీరింగ్‌ సవాళ్లు, సాంకేతిక సమస్యలు, కోర్టు కేసుల చిక్కులను అధిగమించి మెట్రో మార్గాన్ని పూర్తిచేసినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

రివర్సల్‌ సదుపాయం లేక రైళ్లు ఆలస్యం...
జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు (5 కి.మీ.) మార్గంలో మెట్రో మార్గం ఒకే వరుసలో (సింగిల్‌ ట్రాక్‌) ఉండటంతో మెట్రో రైళ్లు ట్విన్‌ సింగిల్‌ లైన్‌ మాన్యువల్‌ విధానంలో నడపనున్నట్లు ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. అంటే ఒక రైలు అమీర్‌పేట్‌ నుంచి బయలుదేరి హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి ఒకే ట్రాక్‌లో తిరిగి రావాల్సి ఉంటుంది. దీంతో ఈ రూట్లో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకో రైలును మాత్రమే నడపనున్నామన్నారు. హైటెక్‌సిటీ స్టేషన్, ట్రైడెంట్‌ హోటల్‌ వద్ద రైలు రివర్సల్‌ సదుపాయం కోసం ట్రాక్‌ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు. కాగా ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–అమీర్‌పేట్‌ మార్గంలో ప్రతి 6 నిమిషాలకో రైలు నడుపుతున్నామన్నారు.

ఈ స్టేషన్లలో కొంతకాలం రైలు ఆగదు
ఈ మార్గంలో ప్రస్తుతం ట్విన్‌ సింగిల్‌ లైన్‌ విధానంలో రైళ్లను నడపాల్సి రావడం, మెట్రో వేగంపై పరిమితులుండటం, మలుపులు అధికంగా ఉండటంతో కొన్ని వారాల పాటు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్లలో రైలు ఆపే అవకాశం ఉండదని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇది తాత్కాలికమేనని త్వరలో ఈ స్టేషన్లలోనూ రైలు ఆగుతుందన్నారు. ఈ మార్గంలో నిత్యం లక్ష మంది వరకు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాగోల్‌–అమీర్‌పేట్, ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లలో సుమారు 2 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్న విషయం విదితమే.

మెట్రో అందుబాటులోకి వచ్చిన మార్గాలు..
ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ.)
నాగోల్‌–అమీర్‌పేట్‌ (17 కి.మీ.)

అందుబాటులోకి రావాల్సి మార్గాలివే...
అమీర్‌పేట–హైటెక్‌సిటీ (10 కి.మీ.
(బుధవారం నుంచి రాకపోకలు ప్రారంభం)
జేబీఎస్‌–ఎంజీబీఎస్‌
(ఈ ఏడాది జూన్‌ లేదా డిసెంబర్‌ నుంచి ప్రారంభమయ్యే అవకాశం)
ఎంజీబీఎస్‌–పాతనగరం
(2019 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement