high-tech city
-
నాగోల్–హైటెక్‌సిటీ: మెట్రోలో 55 నిమిషాలే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ఈ నెల 20న (బుధవారం) హైటెక్ సిటీకి పరుగులు పెట్టనుంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఉదయం 9.30 గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి హైటెక్ సిటీకి మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొందరు ఉన్నతాధికారులు, ఎల్అండ్టీ, మెట్రో ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు రైలు అందుబాటులోకి రానుంది. 18 నిమిషాల్లో అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ చేరుకోవచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి సింగిల్‌ట్రాక్‌లో మెట్రోరైలు హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి రానుంది. దీంతో చెక్‌పోస్ట్ నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు వేగం కాస్త తగ్గే అవకాశం ఉంది. కాగా ఇక నాగోల్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రోలో 55 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. అదే బస్సు లేదా కారులో అయితే దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. 10కి.మీ 9 స్టేషన్లు.. అమీర్‌పేట్ నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కి.మీ. దూరంలో 9 స్టేషన్లున్నాయి. ప్రధానంగా అమీర్‌పేట్, తరుణి–మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నం.5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెర్వు, హైటెక్ సిటీ స్టేషన్లున్నాయి. తరుణి మధురానగర్ స్టేషన్లో మహిళలు, చిన్నారుల అవసరాల కోసం అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచారు. దీని కోసం ఈ స్టేషన్ ప్రాంగణంలో సుమారు 2 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించడం విశేషం. దేశంలో ఇలాంటి సౌకర్యాలున్న మెట్రోస్టేషన్ ఇదేనని అధికారులు తెలిపారు. మిగతా మెట్రో స్టేషన్లు రెండంతస్తుల్లో ఉండగా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ మాత్రం ట్రాఫిక్ ఇబ్బందుల రీత్యా ఒకే అంతస్తులో నిర్మించారు. ఈ మార్గంలో రహదారులు పలు మలుపులు తిరిగి ఉండటంతో అనేక ఇంజనీరింగ్ సవాళ్లు, సాంకేతిక సమస్యలు, కోర్టు కేసుల చిక్కులను అధిగమించి మెట్రో మార్గాన్ని పూర్తిచేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రివర్సల్ సదుపాయం లేక రైళ్లు ఆలస్యం... జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి హైటెక్‌సిటీ వరకు (5 కి.మీ.) మార్గంలో మెట్రో మార్గం ఒకే వరుసలో (సింగిల్ ట్రాక్) ఉండటంతో మెట్రో రైళ్లు ట్విన్ సింగిల్ లైన్ మాన్యువల్ విధానంలో నడపనున్నట్లు ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. అంటే ఒక రైలు అమీర్‌పేట్ నుంచి బయలుదేరి హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి ఒకే ట్రాక్‌లో తిరిగి రావాల్సి ఉంటుంది. దీంతో ఈ రూట్లో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకో రైలును మాత్రమే నడపనున్నామన్నారు. హైటెక్‌సిటీ స్టేషన్, ట్రైడెంట్ హోటల్ వద్ద రైలు రివర్సల్ సదుపాయం కోసం ట్రాక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు. కాగా ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో ప్రతి 6 నిమిషాలకో రైలు నడుపుతున్నామన్నారు. ఈ స్టేషన్లలో కొంతకాలం రైలు ఆగదు ఈ మార్గంలో ప్రస్తుతం ట్విన్ సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడపాల్సి రావడం, మెట్రో వేగంపై పరిమితులుండటం, మలుపులు అధికంగా ఉండటంతో కొన్ని వారాల పాటు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లలో రైలు ఆపే అవకాశం ఉండదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇది తాత్కాలికమేనని త్వరలో ఈ స్టేషన్లలోనూ రైలు ఆగుతుందన్నారు. ఈ మార్గంలో నిత్యం లక్ష మంది వరకు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో సుమారు 2 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్న విషయం విదితమే. మెట్రో అందుబాటులోకి వచ్చిన మార్గాలు.. ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.) నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.) అందుబాటులోకి రావాల్సి మార్గాలివే... అమీర్‌పేట–హైటెక్‌సిటీ (10 కి.మీ. (బుధవారం నుంచి రాకపోకలు ప్రారంభం) జేబీఎస్–ఎంజీబీఎస్ (ఈ ఏడాది జూన్ లేదా డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం) ఎంజీబీఎస్–పాతనగరం (2019 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం) -
ఒత్తిడితో చిత్తు!
► ఐటీ రంగంలో పెరుగుతున్న ‘డిప్రెషన్’ ► గ్రేటర్లో ఐదు శాతం మంది బాధితులు ► నిద్రలేమి, అధిక పని, హడావుడి జీవనంతో సమస్యలు ► ప్రైవేట్ సంస్థ సర్వేలో వెల్లడి... సాక్షి, సిటీబ్యూరో : హైటెక్ సిటీగా పేరొందిన గ్రేటర్లో నగరంలో ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల్లో పనిచేస్తున్న పలువురు డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, నైట్‌షిఫ్టులు, అధిక పనిగంటలు, వ్యక్తిగత, దాంపత్య సమస్యలు, నిద్రలేమి వెరసి మానసిక సమస్యలకు దారితీస్తున్నట్లు వెల్లడైంది. ప్రధానంగా 25–40 ఏళ్ల మధ్యనున్నవారిలో సుమారు 5 శాతం మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ డెవలప్మెంట్’ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రభావంతో పనిలో చురుకుదనం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తేలింది. గుర్తించడం కష్టమే... మానసిక సమస్యలతో బాధపడుతున్నవారిని, డిప్రెషన్ బాధితులను గుర్తించడం కష్టసాధ్యమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. పనిలో చురుకుదనం లోపించడం, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకోలేకపోవడం, పనిని భారంగా పరిగణించి పనికి దూరంగా ఉండడం, సామాజిక సంబంధాలకు దూరంగా ఉండడం, ఒంటరితనాన్ని ఇష్టపడడం వంటి లక్షణాలు కనపడితే వారికి కౌన్సిలింగ్ అవసరమని సూచిస్తున్నారు. మానసిక, శారీరక చురుకుదనం కోసం వ్యాయామాలు చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, వైద్యులు సూచించిన మందుల వాడకంతో డిప్రెషన్ సమస్యను కొంతమేర అధిగమించవచ్చని స్పష్టంచేస్తున్నారు. ఈ ఆహారం బెస్ట్... డార్క్ చాక్లెట్స్, బీన్స్, ఫ్లాక్ సీడ్స్, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండే చేపలు, సోయా, పాలకూర, ఓట్స్, గుడ్లు, నట్స్, గుమ్మడి విత్తనాలు, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే డిప్రెషన్ సమస్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్, పొగకు దూరం..దూరం.. డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నవారు అధికంగా ఆల్కహాల్, సిగరెట్లు తాగడం, కాఫీ, టీలు అధికంగా తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటికి దూరంగా ఉంటేనే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో సమస్య మరింత తీవ్రమవుతుందని స్పష్టంచేస్తున్నారు. డిప్రెషన్ లక్షణాలివీ... ⇒ పనిలో ఏకాగ్రత లోపించడం. ⇒ తీవ్ర విచారం, కుంగుబాటు. ⇒ రోజుకు ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రించడం. ⇒ సామాజిక సంబంధాలు తగ్గడం. బంధుమిత్రులతో సరదాగా గడపకపోవడం ⇒ పనిలో ఉత్పాదకత తగ్గడం. ⇒ చేస్తున్న పనిలో సమగ్రత లోపించడం. ⇒ మానసిక సామర్థ్యం తగ్గడం. ⇒ ఒంటరితనాన్ని ఇష్టపడడం. అధిక పనిఒత్తిడే కారణం ఐటీ, బీపీఓ, కెపీఓ రంగాల్లో పనిచేసేవారు అధిక పనివత్తిడి,రాత్రి వేళల్లో పనిచేస్తుండడం, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపేస్తుండడంతోనే సిటీలో డిప్రెషన్ బాధితులు పెరుగుతున్నారు. బిజీలైఫ్‌లో బంధుమిత్రులతో సరదాగా గడిపే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు. అధిక పనిభారం కారణంగా మెదడులో కార్టిసాల్ అనే రసాయనం ఉత్పత్తి పెరిగి కుంగుబాటుకు గురవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే యోగా, ప్రాణాయామం, వాకింగ్ ఇతర వ్యాయామాలు చేయడంతోపాటు, జీవనశైలిని మార్చుకోవాలి. ఇలా చేస్తే కుంగుబాటు సమస్య నుంచి బయటపడవచ్చు. సమస్య అధికంగా ఉంటే.. సైకాలజిస్టు పర్యవేక్షణలో 6–8 వారాలపాటు వ్యాయామం, మందుల వాడకంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. – మోతుకూరి రాంచందర్, సైకాలజిస్టు, హిమాయత్‌నగర్ -
క్రూ 2015 సదస్సు 5న...
సిటీలోని 200కిపైగా కార్పొరేట్ సంస్థలు, 100కిపైగా కన్సల్టెన్సీలు పాల్గొనే క్రూ 2015 సదస్సు ఈ నెల 15న జరుగనుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు సోమవారం విలేకరులకు తెలిపారు. ‘చేంజింగ్ రోల్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ కన్సల్టెంట్స్’ అనే అంశంపై ఈ సదస్సు జరుగుతుందని, సిటీ నుంచి మాత్రమే కాక దేశవ్యాప్తంగా పలు సంస్థలు పాల్గొంటున్న ఈ సదస్సు హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న వెస్టిన్ హోటల్లో జరుగుతుందన్నారు. సరైన టాలెంట్‌ను ఎంచుకోవడంలో కార్పొరేట్లకు, సరైన, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడంలో అవరోధాలు ఎదర్కొంటున్న కన్సల్టెంట్లకు మధ్య ఒక చక్కని ఉపయుక్తమైన వారధిగా తమ క్రూ 2015 సదస్సును పేర్కొన్నారు నిర్వాహకులు. -
ఐటీ పిటీ
=‘అభయ’ ఘటనతో ఉలిక్కిపడిన ఐటీరంగం =మహిళా ఉద్యోగుల్లో అభద్రత =ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడం శాపం =భద్రత లేని ఆటోలు, క్యాబ్‌లు =అరకొరగా సీసీ కెమెరాలు =నైట్‌విజన్ కెమెరాలకు దిక్కులేదు =అడుగడుగునా భద్రత డొల్ల సాక్షి, హైదరాబాద్/సిటీబ్యూరో/గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ఐటీ కారిడార్.. చూడ్డానికి అందంగా, అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో ఐటీ ఉద్యోగులు మాత్రం ఆ కారిడార్‌లో అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. ప్రత్యేకించి అమ్మాయిల భద్రత గాలిలో దీపంలా మారింది. ఒక నిఘా, నియంత్రణ లేని పాలకుల నిర్వాకం కొందరి జీవితాల్ని చిదిమేస్తోంది. ఐటీ కారిడార్‌లో నేరగాళ్ల స్వైరవిహారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ‘అభయ’ ఉదంతమే నిదర్శనం. ఇందుకు ఎన్నెన్నో కారణాలు.. నిర్లక్ష్యం కొంత.. ఆదమరుపు మరికొంత.. ఏదైనా ఘటన జరిగినపుడు హడావుడి.. ఆపై మిన్నకుండిపోవడం.. ఫలితంగా హైటెక్ సిటీలో పనిచేసే అమ్మాయిలకు భద్రత కరువైంది. కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ ఇక్కడ లోపించింది. రాత్రి 8 దాటితే సిటీ బస్సు జాడ ఉండదు. గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నేరాలకు, ఘోరాలకు దారితీస్తోంది. సగర్వంగా తలెత్తుకున్నా.. ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్ర ఐటీ రంగం నిలదొక్కుకుంది. దేశంలో నాలుగో స్థానంలో నిలిచి సగర్వంగా తలెత్తుకుంది. కానీ అదే ఐటీ కారిడార్‌లో పనిచేసే ఓ అమ్మాయి మృగాళ్ల చేతిలో దగాపడిందని తెలిసి మొత్తం సభ్య సమాజం నివ్వెరపోయింది. మహిళా ఉద్యోగులు అభద్రతకు గురయ్యారు. రాష్ట్రం మొత్తం మీద 3,27,000 మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ ఐటీ ఉద్యోగుల్లో వీరి సంఖ్య 11.4 శాతం. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ రంగంలో 3 లక్షల వరకు ఉద్యోగులున్నారు. వీరిలో 30- 40 శాతం మంది మహిళా ఉద్యోగులున్నట్టు అంచనా. దశలవారీగా ఐటీ రంగం విస్తరి స్తుంటే.. అందులోని ఉద్యోగులకు కష్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు ప్రజారవా ణావ్యవస్థ విస్తరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఉద్యోగులు అవస్థల పాలవుతున్నారు. ప్రధాన లోపం అదే.. సైబారాబాద్ దాదాపు 52 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఐటీ సంస్థలన్నీ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ) పరిధిలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 3 లక్షల సాధారణ జనా భా నివాసం ఉంటోంది. వీరితోపాటు దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు ప్రధానంగా మాదాపూర్‌లోని సైబర్టవర్స్, సైబర్ పెర్ల్, సైబర్ గేట్‌వే, రహేజా మైండ్‌స్పేస్, ఆర్ఎంజడ్ ఫ్యూచురా, టీసీఎస్ డెక్కన్పార్క్, డెల్, కన్వర్జిస్, వానెన్బర్గ్ ఐటీపార్క్, ఐల్యాబ్స్ క్యాంపస్‌లలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. కొండాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవ ర్, సత్యం సైబర్‌స్పేస్, సత్యం ఇన్ఫోసిటీ, టీసీఎస్ పార్క్, ఎస్ఎంఆర్ టెక్నాలజీస్ తదితర క్యాంపస్‌ల్లోనూ ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇవి తొలివిడత విస్తరణలో వచ్చిన సంస్థలు. మలిదశలో గచ్చిబౌలిలో ఐఎస్బీ, ఇన్ఫోసిస్, డీఎల్ఎఫ్ సిటీ, ఎస్డీఈ ప్రమేలా తదితర క్యాంపస్‌లు వచ్చా యి. మణికొండలో మైక్రోసాఫ్ట్, పోలారిస్, విప్రో, కాన్బే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, యూబీఎస్, సీఏ, సియరా అట్లాంటిక్, వట్టినాగులపల్లిలో సత్యం క్యాంపస్.. ఇలా వరుసగా కొత్తవి వచ్చాయి. ప్రస్తు తం తెల్లాపూర్, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాల్లోనూ ఐటీ సెజ్‌లు నెలకొంటున్నాయి. ఐ టీ కారిడార్‌లో నివాస ప్రాంతాలు ఖరీదైనవి కావడంతో ఇక్కడికి దూరంగా ఉండి విధులకు హాజరవుతున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. బస్సులు లేదా ప్రైవేటు వాహనాలే వీరికి దిక్కు. తొలిదశలో ఏర్పాటైన ఐటీ క్యాంపస్‌లకే పూర్తిస్థాయిలో ప్రజారవాణా వ్యవస్థ లేదు. పట్టుమని నాలుగు కి.మీ.దూరంలేని జేఎన్టీయూహెచ్ క్యాంపస్ వరకు కూ డా ఆర్టీసీ బస్సులు నడవవు. ఐటీ ఉద్యోగులంతా ప్రగతినగర్, మియాపూర్, నిజాంపేట, హైదర్‌నగర్‌లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ మార్గాల్లో బస్సులే లేవన్నది వీరి ప్రధాన ఆరోపణ. ఇక అల్వాల్, సైనిక్‌పురి ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి ఎక్కాల్సిందే. బోయిన్పల్లి, మేడ్చల్, అల్వాల్, జేబీఎస్, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లేవు. శేరిలింగంపల్లి, నల్లగండ్ల, బీహెచ్ఈల్ తదితర ప్రాంతాలను ఐటీ కారిడార్‌కు కలుపుతూ రవాణా వ్యవస్థ లేదు. ఉప్పల్, సికింద్రాబాద్, కోటి.. ఈ మూడు మార్గాల్లోనే బస్సులు నడుస్తున్నాయి. ఇక రాత్రి వేళ అయితే జాడే ఉండవు. ప్రైవేటే శరణ్యం.. గతంలో షేరింగ్ ఆటోలో ఓ ఐటీ ఉద్యోగినిపై దాడి జరిగినప్పుడు వివిధ శాఖలు కొంత హడావుడి చేసినా ప్రజా రవాణా వ్యవస్థను మాత్రం మెరుగుపరచలేదు. అప్పట్లో మహిళా ఉద్యోగినుల రక్షణకు ఐటీ, పోలీస్ విభాగాలు కొంత సమన్వయంతో పనిచేసినా.. ఆపై మిన్నకుండిపోయాయి. దుర్ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం కంటే నివారణ చర్యలపై దృష్టిపెడితే మేలని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. అధికారులతో మాట్లాడాం: మంత్రి లక్ష్మయ్య ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, ఇతర సమస్యలపై ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను వివరణ కోరగా.. ‘ఐటీ ఉద్యోగినిపై జరిగిన లైంగికదాడి ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళలపై ఎక్కడ, ఎలాంటి ఘటన జరిగినా అది దురదృష్టకరమై నదే. గత ఏడాది నుంచే భద్రత విషయంలో ఐటీ ఉద్యోగులకు పలు దఫాలుగా అవగాహన కల్పించాం. ఐటీ సంస్థల మహిళా ఉద్యోగులకు కచ్చితంగా క్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఇదివరకు సూచించాం. ఇకపై కూడా సూచిస్తాం. ఐటీ కారిడార్‌లో మౌలిక వసతులపై మరోసారి సమీక్షించి చర్యలు తీసుకుంటాం’ అన్నారు. ఈ ప్రాంతంలో క్యాబ్లే గతి.. ‘ఈ ప్రాంతంలో షేరింగ్ ఆటోలు, ప్రైవేటు క్యాబ్లే గతి. ఒక్కరే ఆటో ఎక్కాలంటే చిన్నచిన్న రూట్లలోనే రూ. 150 వరకు అడుగుతున్నారు. ప్రధాన రూట్లలోనే బస్సుల్లేవు. సైబర్ టవర్స్ వరకు ఉన్నా.. మలిదశలో విస్తరించిన ఐటీ క్యాంపస్‌ల వరకు బస్సులు లేవు. రాత్రివేళ అసలే లేవు..’ - నరేంద్రకుమార్, ఐటీ రిక్రూటింగ్ సంస్థ మినీ బస్సులైనా... ‘ఐటీ సంస్థలు ఉన్న ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ చాలా ఎక్కువుంది. అమ్మాయిలు బైక్‌పై వెళుతుంటేనే పక్క నుంచి అరుపులు, కామెంట్లు వినిపిస్తుంటాయి. కనీసం మినీ బస్సులైనా నడిపిస్తే అమ్మాయిలకు భరోసా ఉంటుంది. అన్ని సంస్థల్లో క్యాబ్ వ్యవస్థ లేదు. విభిన్న షిఫ్టుల్లో పనిచేయాలి. రాత్రివేళలో రహేజా నుంచి గచ్చిబౌలి మార్గంలో కనీసం విద్యుత్తు దీపాలు కూడా వెలగవు. నిరంతరం బస్సు సౌకర్యం, పోలీస్ గస్తీ ఏర్పాటుచేయాలి’ - స్రవంతి, ఐటీ ప్రోగ్రామర్