ఒత్తిడితో చిత్తు!
► ఐటీ రంగంలో పెరుగుతున్న ‘డిప్రెషన్’
► గ్రేటర్‌లో ఐదు శాతం మంది బాధితులు
► నిద్రలేమి, అధిక పని, హడావుడి జీవనంతో సమస్యలు
► ప్రైవేట్ సంస్థ సర్వేలో వెల్లడి...
సాక్షి, సిటీబ్యూరో : హైటెక్ సిటీగా పేరొందిన గ్రేటర్‌లో నగరంలో ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల్లో పనిచేస్తున్న పలువురు డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, నైట్‌షిఫ్టులు, అధిక పనిగంటలు, వ్యక్తిగత, దాంపత్య సమస్యలు, నిద్రలేమి వెరసి మానసిక సమస్యలకు దారితీస్తున్నట్లు వెల్లడైంది.
ప్రధానంగా 25–40 ఏళ్ల మధ్యనున్నవారిలో సుమారు 5 శాతం మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ డెవలప్‌మెంట్’ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రభావంతో పనిలో చురుకుదనం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తేలింది.
గుర్తించడం కష్టమే...
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారిని, డిప్రెషన్ బాధితులను గుర్తించడం కష్టసాధ్యమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. పనిలో చురుకుదనం లోపించడం, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకోలేకపోవడం, పనిని భారంగా పరిగణించి పనికి దూరంగా ఉండడం, సామాజిక సంబంధాలకు దూరంగా ఉండడం, ఒంటరితనాన్ని ఇష్టపడడం వంటి లక్షణాలు కనపడితే వారికి కౌన్సిలింగ్ అవసరమని సూచిస్తున్నారు. మానసిక, శారీరక చురుకుదనం కోసం వ్యాయామాలు చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, వైద్యులు సూచించిన మందుల వాడకంతో డిప్రెషన్ సమస్యను కొంతమేర అధిగమించవచ్చని స్పష్టంచేస్తున్నారు.
ఈ ఆహారం బెస్ట్...
డార్క్ చాక్లెట్స్, బీన్స్, ఫ్లాక్ సీడ్స్, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండే చేపలు, సోయా, పాలకూర, ఓట్స్, గుడ్లు, నట్స్, గుమ్మడి విత్తనాలు, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే డిప్రెషన్ సమస్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఆల్కహాల్, పొగకు దూరం..దూరం..
డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నవారు అధికంగా ఆల్కహాల్, సిగరెట్లు తాగడం, కాఫీ, టీలు అధికంగా తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటికి దూరంగా ఉంటేనే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో సమస్య మరింత తీవ్రమవుతుందని స్పష్టంచేస్తున్నారు.
డిప్రెషన్ లక్షణాలివీ...
⇒ పనిలో ఏకాగ్రత లోపించడం.
⇒ తీవ్ర విచారం, కుంగుబాటు.
⇒ రోజుకు ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రించడం.
⇒ సామాజిక సంబంధాలు తగ్గడం. బంధుమిత్రులతో సరదాగా గడపకపోవడం
⇒ పనిలో ఉత్పాదకత తగ్గడం.
⇒ చేస్తున్న పనిలో సమగ్రత లోపించడం.
⇒ మానసిక సామర్థ్యం తగ్గడం.
⇒ ఒంటరితనాన్ని ఇష్టపడడం.
అధిక పనిఒత్తిడే కారణం
ఐటీ, బీపీఓ, కెపీఓ రంగాల్లో పనిచేసేవారు అధిక పనివత్తిడి,రాత్రి వేళల్లో పనిచేస్తుండడం, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపేస్తుండడంతోనే సిటీలో డిప్రెషన్ బాధితులు పెరుగుతున్నారు. బిజీలైఫ్‌లో బంధుమిత్రులతో సరదాగా గడిపే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు.
అధిక పనిభారం కారణంగా మెదడులో కార్టిసాల్ అనే రసాయనం ఉత్పత్తి పెరిగి కుంగుబాటుకు గురవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే యోగా, ప్రాణాయామం, వాకింగ్ ఇతర వ్యాయామాలు చేయడంతోపాటు, జీవనశైలిని మార్చుకోవాలి. ఇలా చేస్తే కుంగుబాటు సమస్య నుంచి బయటపడవచ్చు. సమస్య అధికంగా ఉంటే.. సైకాలజిస్టు పర్యవేక్షణలో 6–8 వారాలపాటు వ్యాయామం, మందుల వాడకంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. – మోతుకూరి రాంచందర్, సైకాలజిస్టు, హిమాయత్‌నగర్