కేంద్ర ప్రభుత్వ స్లాబులనే ఖరారు చేసిన టీ-సర్కారు
అందుకనుగుణంగా ధరలను
సవరించాలని కంపెనీలకు విజ్ఞప్తి
ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్(పాలీహౌస్)కు మోక్షం లభించింది. యూనిట్ ధరలపై దాదాపు నెల రోజులుగా కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ ధరను గ్రీన్‌హౌస్ నిర్మాణ కంపెనీలు అంగీకరించకపోవడం..ఆ వ్యవహారంపై పునఃపరిశీలన చేసిన ఉద్యానశాఖ సాంకేతిక కమిటీ కేంద్ర ప్రభుత్వ యూనిట్ ధరలను ఖరారు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 15 రోజులుగా దీనిపై ఎటూ తేల్చని సర్కార్.. మంగళవారం కేంద్ర ప్రభుత్వ ధరలనే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రీన్‌హౌస్ నిర్మాణానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. టెక్నికల్ బిడ్లు పూర్తైన నేపథ్యంలో అందులో పాల్గొన్న 8 గ్రీన్‌హౌస్ కంపెనీలతో చర్చించి కేంద్ర ప్రభుత్వ ధరలకే నిర్మాణాలు చేపట్టాలనీ, అన్ని సంస్థలు అందుకు అంగీకరించాలని ప్రభుత్వం కోరనుంది. అనంతరం రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. దరఖాస్తుల స్వీకరణకు 15 రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది.
ఒక్కో స్లాబుకు ఒక్కో యూనిట్ ధర...
కేంద్రం 4 స్లాబుల్లో యూనిట్ ధరలను నిర్ణయించింది. వాటినే రాష్ట్రంలో అమలుచేస్తారు. ఆ ప్రకారం 500 నుంచి 560 చదరపు మీటర్ల స్లాబుకు చదరపు మీటరకు రూ. 1,060 చొప్పున కంపెనీలకు చెల్లిస్తారు. 560 నుంచి 1,008 చదరపు మీటర్లు ఉంటే రూ. 935 చొప్పున, 1,008 నుంచి 2,080 మధ్య ఉంటే రూ. 890, 2,080 నుంచి 4,000లకు పైగా చదరపు మీటర్ల స్లాబుకు రూ. 844 చొప్పున కంపెనీలకు చెల్లిస్తారు. ఆ యూనిట్ వ్యయంలోనే అన్ని పన్నులూ కలిపి ఉంటాయి. ఆ ప్రకారం రైతులకు 75 శాతం సబ్సిడీ ఉంటుంది. అయితే బిడ్‌లో పాల్గొన్న 8 కంపెనీలు వివిధ ధరలను కోట్ చేశాయి. వీటిని కేంద్ర ప్రభుత్వ ధరలకు అనుగుణంగా సవరించాలని కోరనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఏదైనా కంపెనీ అందుకు అంగీకరించకపోయినా జాబితాలో ఉంచుతారు. రైతులు తమకు ఇష్టమైన కంపెనీనే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కల్పిస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం నిర్ణీత సొమ్మునే చెల్లిస్తుంది. ఆ మేరకే ప్రభుత్వం రైతులకు సబ్సిడీ చెల్లిస్తుందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ సహా నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని ప్రాంతాల రైతులు గ్రీన్‌హౌస్‌కు సిద్ధం కావాలని అధికారులు కోరారు.
గ్రీన్‌హౌస్‌కు మోక్షం
Published Wed, Feb 4 2015 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement