
కాల్పులు జరిపింది ఓబులేశే: సీపీ
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు పులి ఓబులేశును అరెస్ట్ చేసినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు తెగబడింది ఓబులేశేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అతనొక్కడే ఈ నేరం చేశాడని చెప్పారు. బెల్ ఫామ్(తుపాకులను శుభ్రం చేసే చోటు) నుంచి ఎత్తుకుపోయిన ఏకే 47 రైఫిల్, లోడెడ్ మేగజీన్ తో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు.
కడప జిల్లా కోరుమామిళ్ల మండలానికి చెందిన ఓబులేసు పోలీసు కానిస్టేబుల్ గా చేరాడని, తర్వాత గ్రేహౌండ్స్ కు మారాడని చెప్పారు. దొంగిలించిన ఆయుధాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో గుట్టల్లో దాచాడన్నారు. గత ఫిబ్రవరిలో కేబీఆర్ పార్క్ వద్ద ఒకరిని అపహరించి సఫలమయ్యాడన్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు వరకు తీసుకెళ్లి రూ.10 లక్షల వసూలు చేశాడని చెప్పారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇది వెలుగులోకి రాలేదన్నారు.
నిత్యానంద రెడ్డిని కూడా కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో దొరికిపోయాడని వివరించారు. కాల్పులు జరిగిన ఆరేడు గంటల్లోనే నిందితుడిని గుర్తించామన్నారు. ఇమ్లిబన్ బస్టాండ్ నుంచి బస్సులో కర్నూలు పారిపోయాడని చెప్పారు. 37 ఏళ్ల ఓబులేశుకు ఇంకా పెళ్లికాలేదని, విలాసాలకు అలవాటు పడి వక్రమార్గం పట్టాడని మహేందర్రెడ్డి తెలిపారు.