పాతాళ గంగ మరింత పైకి.. | Groundwater Increased In Adilabad | Sakshi
Sakshi News home page

పాతాళ గంగ మరింత పైకి..

Published Thu, Aug 30 2018 12:02 PM | Last Updated on Thu, Aug 30 2018 12:03 PM

Groundwater Increased In Adilabad - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: పాతాళ గంగ మరింత పైకి వచ్చింది. జిల్లాలో ఈ యేడాది కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నీళ్లు అధికంగా పైకి రావడం గమనార్హం. జిల్లాలో జూలై, ఆగస్టు మాసాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో పాతాళ గంగ ఉబికి పైకొస్తోంది. జిల్లాలో సగటున 1.94 మీటర్ల లోతులోనే   భూగర్భ జలాలు ఉన్నాయి. బజార్‌హత్నూర్, జైనథ్, నేరడిగొండ, తాంసి, నార్నూర్‌లలో మీటర్‌ కంటే తక్కువ లోతులోనే జలాలు లభ్యమవుతున్నాయి.

జిల్లా అంతటా.. 
జిల్లా అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. అయితే ఈ జలాలు ప్రస్తుతం స్థిమితంగా ఉండవని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే కొంత దిగువకు చేరుకుంటాయని భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వర్షాకాలం ముగిసే సమయంలో అక్టోబర్‌లో భూగర్భ జలాలపై ఒక అంచనాకు రావచ్చని పేర్కొంటున్నారు. అయితే గతేడాది కంటే ఈయేడాది కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలాలు భూస్థాయి నుంచి చాలా తక్కువ లోతులోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రతినెల చివరిలో జిల్లా భూగర్భ జలాల శాఖ జిల్లాలోని భూగర్భ జలాలను కొలవడం జరుగుతోంది. జిల్లాలోని 15 మండలాల్లో ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిని కొలుస్తారు.

భూస్థాయి నుంచి ఎంత లోతులో ఈ నీళ్లు ఉన్నాయనే దానిపై నివేదిక తయారు చేసి నెల చివరిలో ప్రకటించడం జరుగుతుంది. జిల్లాలో ప్రధానంగా వివిధ రకాల నేలలు ఉన్నాయి. గ్రానైట్స్, బాసల్ట్సŠ, లైమ్‌స్టోన్, శాలెస్, ట్రాప్స్‌ రకాల నేలలు ఉన్నాయి. మొదట మొరంతో ఉండి ఆ తర్వాత లోపల బండరాయి కలిగి తిరిగి మట్టి వంటి నేలలు అధికంగా ఉన్నాయి. దీంతో భూగర్భ జలాల అంచనా వేసిన దానికంటే తర్వాత రోజుల్లో గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రధానంగా నేరడిగొండ, గుడిహత్నూర్‌ వంటి మండలాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఆదిలాబాద్‌ చుట్టుపక్కల సున్నపురాయి అధికంగా ఉంది.

కొన్ని మండలాల్లో గణనీయం..
జిల్లాలో జూన్‌ మొదటి వారంలోనే తొలకరి వర్షాలు మురిపించాయి. ఆ తర్వాత సుమారు 15 రోజుల పాటు ముఖం చాటేశాయి. ఆ నెల చివరి వారంలో మళ్లీ కొంత వర్షం కురువడం ఊరటనిచ్చింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 204 మిల్లీమీటర్లు ఉండగా, 246 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది సాధారణం కంటే అధికంగానే నమోదైనప్పటికీ ఆ నెలలో డ్రైస్పెల్‌ అధికంగా నమోదైంది. అయితే జూలైలో మాత్రం ఏకధాటిగా వర్షాలు కురువడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రధానంగా జిల్లాలోని జలాశయాలతో పాటు చెరువులన్ని నిండిపోయాయి. ఎటుచూసినా జలకళ సంతరించుకుంది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 300 మిల్లీమీటర్లు కాగా, 375 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆగస్టులో 333 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా, 598 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. 18 మండలాల్లో 15 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మిగతా 3 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది.
 

భూగర్భజలాలు  స్థిమితంగా ఉండవు
వర్షపాతం తగ్గినకొద్ది భూగర్భ జలాల పరిస్థితిలో మార్పు వస్తుంది. జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలకు సగటున 1.94 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి. అక్టోబర్‌ వరకు వర్షాలు కురిసిన తర్వాత జిల్లా భూగర్భ జలాలపై ఒక అంచనాకు రావచ్చు. జిల్లాలో వివిధ రకాల నేలలు ఉన్నాయి. పైన మట్టి మధ్యలో సున్నపురాయి, ఇతర ఖనిజాలు ఉండి తిరిగి మట్టి నేలలు కలిగి ఉన్నాయి. దీంతో జలాలు దిగువకు పోయేది అంచనా వేసిన తర్వాత కూడా కొంత మార్పు వస్తుంది.  – పుల్లయ్య, భూగర్భ జలాల శాఖ జిల్లా అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement