సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు పనులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను ఉపసంహరించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టే కాంట్రాక్టు పనులకు 12 శాతం జీఎస్టీ ఉంటుందని... అయితే మట్టిపనులకు మాత్రం 5 శాతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో జరిగిన 22వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది.
భారం తగ్గనట్టే..!
తొలుత జీఎస్టీ చట్ట ప్రకారం కాంట్రాక్టు పనులపై 18 శాతం జీఎస్టీని విధించారు. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారుతుందని.. ఇప్పటికే జరుగుతున్న మిషన్ కాకతీయ, భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు లాంటి కార్యక్రమాలపై రూ.36 వేల కోట్లకు పైగా భారం పడుతుందని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. జీఎస్టీని తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగా.. కేంద్రం 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. కానీ ఆ తగ్గింపు వల్ల ఉపశమనం నామమాత్రమేనని అధికారులు అంచనా వేయడంతో.. 5 శాతానికి తగ్గించాలని రాష్ట్రం డిమాండ్ చేసింది. అసలు ప్రజోపయోగ కాంట్రాక్టు పనులపై జీఎస్టీని రద్దు చేయాలని కోరింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న జరిగిన 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే వాదన వినిపించింది. కేంద్రం ఈ వాదనలను పట్టించుకోలేదు.
ఆ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. జీఎస్టీని తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదని, దీంతో కాంట్రాక్టు సంస్థలకే తప్ప రాష్ట్రానికి ఏమీ ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. అయితే మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం ఈ నెల 6న ఢిల్లీలో జరిగిన 22వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మట్టిపనుల విలువ 75 శాతం కన్నా ఎక్కువగా ఉండే కాంట్రాక్టు పనులకు మాత్రమే జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
స్థానిక సంస్థలకూ అవకాశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు ప్రభుత్వాల సంస్థలతో పాటు స్థానిక సంస్థలు చేపట్టే మట్టిపనుల కాంట్రాక్టులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులను జీఎస్టీ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఉపశమనం కలిగే అవకాశం లేదని పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మిషన్ కాకతీయ లాంటి మట్టిపనులకు కొంతమేర వెసులుబాటు ఉంటుందని... మిగిలిన కార్యక్రమాలకు ప్రయోజనమేమీ చేకూరదని అంటున్నాయి. ఇక కాంట్రాక్టు పనులపై 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు కేవలం ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు చేపట్టే ప్రాజెక్టులకే వర్తిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో వచ్చే నెల 10న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం ఎలాంటి వాదనలు వినిపిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment