సాక్షి, హైదరాబాద్ : సరుకులు లేవు.. రవాణా లేదు... అమ్మకాలు లేవు.. కొనుగోళ్లు అంతకన్నా లేవు.. కానీ పేపర్లు మాత్రం ఉన్నాయి... సరుకులు రవాణా జరి గినట్టు, అమ్మినట్టు, కొన్నట్టు ఇన్వాయిస్‌లు తయారు చేశారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) పేరుతో రూ.8.23 కోట్ల పన్ను కొల్లగొట్టేశారు. రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణాన్ని హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు గుర్తించారు. ఈ కేసు తో సంబంధమున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కర్నెకోట తులసీరాం అనే వ్యక్తి తులసి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో వ్యాపారం చేస్తున్నారు.
ఎలాంటి సరుకుల రవాణా, అమ్మకాలు లేకుండానే ఈ కంపెనీ పేరుతో అనేక కం పెనీలతో లావాదేవీలు జరిపినట్టు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి పన్ను చెల్లిస్తున్నారు. తాము పన్ను చెల్లిస్తున్నా మని, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలంటూ పత్రాలు దాఖలు చేసి రూ.8.23 కోట్ల మేర ప్రభుత్వం నుంచి తిరిగి తీసుకున్నారు. ఫలానా కంపెనీతో లావాదేవీలు జరిపినట్టు చెప్పిన కంపెనీలు కూడా డమ్మీవే. వీటి ద్వారా తెలంగాణ, ఏపీల్లో లావాదేవీలు జరిపినట్టు చూపించి కుంభకోణానికి పాల్పడ్డారు. ఉప్పందుకున్న హైదరాబాద్ జీఎస్టీ అధికారులు తీగ లాగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మజ్జి గ నర్సింహరాజు, షేక్ షాకీర్‌లు ఈ తతంగమంతా నడిపించారని, నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి పలు కంపెనీలతో లావాదేవీలు జరిపినట్టు కాగితాలు తయారు చేయడంలో వీరి ప్రమేయం ఉందని గుర్తించారు. వీరిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు తేలింది నామమాత్రమేనని, దీనివెనుక పెద్ద రాకెట్ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, స్టీల్, పేపర్ తయారీ కంపెనీలున్నాయని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment