అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు
నారాయణఖేడ్: వేసవిలో ఎండలు మండుతున్నందున ఇక అంగన్‌వాడీ కేంద్రాలను సైతం ఒంటిపూట నిర్వహించనున్నారు. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై అంగన్‌వాడీ కేంద్రాలు ఈ నెల 13 నుంచి మే 31వ తేదీవరకు ఒంటిపూట కొనసాగనున్నాయి. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి.
ఒంటిపూట నిర్వహణకు ఉత్తర్వులు జారీ కావడంతో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. 12 గంటల తర్వాత కేంద్రాన్ని మూసివేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేది ఐదేళ్లలోపు చిన్నారులు. ఎండలు మండిపోతుండడంతో చిన్నారులు సాయంత్రం వరకు కేంద్రాల్లో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యాహ్నం నుంచే ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్, తెలంగాణ మినీ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తుల మేరకు ఒంటిపూట నిర్వహణ ఉత్తర్వులు జారీ చేసినట్లు శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఒంటిపూట అంగన్‌వాడీల నిర్వహణకు సంబంధించి జిల్లాలోని అన్ని సీడీపీఓ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపించారు. జిల్లా మొత్తం 1,504 అంగన్‌వాడీలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధాన కేంద్రాలు 1,344 కాగా, మినీ సెంటర్లు 160 ఉన్నాయి.
ఈ కేంద్రాల్లో 0– 5ఏళ్లలోపు చిన్నారులు 1,13,296 మంది, బాలింతలు 12,259 మంది, గర్భిణులు 11,173 మంది ఉన్నారు. ఒంటి పూట కేంద్రం నిర్వహణ అనంతరం మధ్యాహ్నం 12 తర్వాత ఆయా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు ఇంటింటి సర్వే చేపట్టాల్సి ఉంటుంది. ప్రీస్కూల్ పిల్లల రీ అడ్మిషన్, బడిమానేసిన పిల్లలను గుర్తించడం, ఆరునెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది.
వేసవి సెలవులు ప్రకటించాలి
సంగారెడ్డి రూరల్: వేసవిలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిలు డిమాండ్ చేశారు. బుధవారం సంగారెడ్డి సీఐటీయూ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మాదిరిగానే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం ఎండకాలం కావడంతో చిన్న పిల్లలు కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎండలు ఎక్కువ ఉండటం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గి డీహ్రైడేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, దినకర్, ఎల్లయ్య, ప్రసాద్, బాలమణి, నరేందర్, నాగేష్ , నర్సింలు పాల్గొన్నారు.
సెలవులు ఇవ్వాలి
సంగారెడ్డి టౌన్: ప్రభుత్వపాఠశాలలతో సమానంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని తెలంగాణ అంగ¯Œన్‌వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏసుమణి , కార్యదర్శి మంగమ్మ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు. వాటి ఫలితంగానే అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 13 నుంచి ప్రభుత్వం ఒక పూట సెలవు ప్రకటించిందన్నారు.
ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను కేంద్రాలకు పంపేందుకు నిరాకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సెలవు ప్రకటించాలని, లేని పక్షంలో మళ్లీ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment