సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో అమలు చేస్తున్న సరళీకృత వ్యాపార విధానం ద్వారా 2015–16లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 50 శాతానికి పైగా మహారాష్ట్రకే వచ్చాయని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.1.2 లక్షల కోట్లన్నారు. వ్యాపార సంస్కరణల ద్వారా పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యాన్ని నివారించామని చెప్పారు. గతంలో పరిశ్రమల స్థాపనకు 73 రకాల అనుమతులను 23కు తగ్గించి సింగిల్ విండో విధానం ద్వారా సత్వర అనుమ తులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆన్‌లైన్ ద్వారా 379 రకాల సేవలను అందిస్తున్నామని, ఇప్పటి వరకు 1.1 కోటి దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించినట్లు తెలిపారు. అనుమ తుల తీరుపై 88 శాతం పారిశ్రామికవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో శనివారం నిర్వహించిన సదస్సులో ‘భవిష్యత్తు పాలన’ అంశంపై ఫడ్నవీస్ ప్రసంగించారు.
జనాభాలో 50 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉండటంతో పరోక్షంగా నిరుద్యోగానికి దారితీస్తోందని, పరిశ్రమల స్థాపన ద్వారా 10–20 శాతం జనా భాను వ్యవసా యం నుంచి ఇతర వృత్తుల కు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారత్ నెట్ పథకం కింద 14 వేల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని, వచ్చే ఏడాదిలోగా 29 వేల గ్రామ పంచాయతీలకు ఈ సదుపాయం కల్పిస్తామన్నారు.
జల సంరక్షణమే పరిష్కారం
దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మహా రాష్ట్రలో ఉన్నా.. 18 శాతం పొలాలకే సాగునీటి సదుపాయం ఉందన్నారు. రాష్ట్రంలోని 14 సాగునీటి ప్రాజెక్టు లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చామన్నారు. భారీ ప్రాజెక్టులు, భారీ డ్యాంలు కట్టడం సాగునీటి సమస్యకు పరిష్కారం కాదని, జల సంరక్షణ విధానాలే అసలు పరిష్కారమని గుర్తించినట్లు చెప్పారు. తద్వారా గత రెండున్నరేళ్లలో 11 వేల గ్రామాలను కరువు నిరోధక శక్తి గ్రామాలుగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.