సనత్‌నగర్: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2018 ఏవియేషన్ షోను తిలకించేందుకు ఎంతో ఆశతో వచ్చిన నగరవాసులకు నిరాశే ఎదురైంది. అసలే అంతంతమాత్రంగా విమానాలు ఉండడం... ఉన్న వాటి దగ్గరికి కూడా అనుమతించకపోవడంతో అసహనానికి గురయ్యారు. రన్‌వే మీద ఏర్పాటు చేసిన విమానాలు, హెలికాప్టర్ల దగ్గరికి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దూరం నుంచే చూడాలని ఆంక్షలు విధించారు. దీంతో చేసేదేమిలేక గ్రిల్స్ దగ్గర నిలబడే ఫొటోలు తీసుకొని సంబరపడ్డారు. మరోవైపు వైమానిక విన్యాసాలూ లేకపోవడంతో సందర్శకులు ఉసూరుమన్నారు.
ఫొటో ఖరీదు రూ.2000 : నిజానికి శని, ఆదివారాలు సాధారణ సందర్శకులకు అనుమతి. వీరికి ఎంట్రీ పాస్ రూ.400. కానీ శనివారం వీరిని విమానాల దగ్గరికి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీంతో కొందరు ఔత్సాహికులు తప్పని పరిస్థితుల్లో రూ.2000 వెచ్చించి బిజినెస్ పాస్ కొనుగోలు చేశారు. ఈ పాస్ ఆధారంగా లోపలికి వెళ్లి విమానాలను చూసి, అక్కడ ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
పెద్దగేంలేదు..
ఇక్కడ పెద్దగేం లేదు. ప్రత్యేక విమనాలేవీ లేవు. రూ.400 వెచ్చించి షోకు వస్తే విమానాలు లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. అయితే కొంతమేర మా స్టడీకి సంబంధించి సమాచారం దొరికింది.
– తెలంగాణ ఏవియేషన్ అకాడమీవిద్యార్థులు
ఏంటిది?
వైమానిక విన్యాసాలు లేవు. కొన్ని విమానాలుంటే వాటి దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. మరోవైపు ఫుడ్ ధరలేమో చుక్కల్లో ఉన్నాయి. ఏంటిది? ఇలా చేస్తే సందర్శకులు ఎలా వస్తారు.
– అవినాష్, మోతీనగర్
ఐదారే...
పెద్ద విమానాలు ఉంటాయని వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదారు మాత్రమే ఉన్నాయి. అది కూడా వాటి దగ్గరకు అనుమతించకపోవడం పిల్లలకు నిరాశను కలిగించింది.
– శివకుమార్, ఈసీఐఎల్
స్టాళ్లు.. సగం ఖాళీ
ఎగ్జిబిషన్‌లో సగం స్టాళ్లు ఖాళీ అయ్యాయి. రన్‌వేపై మిగిలిన ఆరు విమానాలు, ఉన్న కొద్దిపాటి స్టాళ్లను తిలకించి సందర్శకులు సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇక ఫుడ్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వాటర్ బాటిల్ రూ.40, ఆహార పదార్థాలు రూ.50కి పైగా ఉండడంతో సందర్శకులకు చిర్రెత్తుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment