
షేక్... హ్యాండ్
- ‘పశ్చిమ’లో రగులుతున్న టికెట్ పంచాయితీ
- టీఆర్‌ఎల్‌డీ విలీనంపై ‘హస్తం’ఆశావహుల గుర్రు
- దిలీప్‌కు అవకాశమిస్తే ఓడిస్తామని హెచ్చరికల జారీ
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పశ్చిమ అసెంబ్లీ సీటు టికెట్ కాంగ్రెస్ పార్టీలో లొల్లి పుట్టిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఈ సెగ్మెంట్‌లో టికెట్ కేటాయింపు సవాల్‌గా మారింది. వరంగల్ పశ్చిమ సీటును ఆశిస్తున్న వారు కాంగ్రెస్‌లోనే డజనుకుపైగా ఉన్నారు. వీరందరినీ కాదని టీఆర్‌ఎల్‌డీ కోటాలో ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌కు అవకాశమిస్తారనే ప్రచారం ఇటీవల జోరందుకుంది.
ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేయూలని భావిస్తున్న కాంగ్రెస్ ఆశావహుల్లో కలకలం మొదలైంది. వారు ఇప్పటికే తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. టీఆర్‌ఎల్‌డీ కోటాలో ఈ సీటు కేటాయింపు ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఖండించకపోవడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కపిలవాయికి ‘పశ్చిమ’ టికెట్ కేటాయించిన పక్షంలో ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు.
ఎంతకైనా తెగిస్తాం...
కాంగ్రెస్ నేతలను కాదని దిలీప్‌కుమార్‌కు టికెట్ ఇస్తే... అందరం కలిసి ఒకరిని బరిలోకి దిం పి గెలిపించుకుంటామని కాంగ్రెస్‌లో పశ్చిమ టికెట్‌ను ఆశిస్తున్న ఆశావహులు చెబుతున్నా రు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు స్పష్టం చేసి న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటామని అం టున్నారు. ఏఐసీసీ స్థాయిలో ఏదైనా జరిగి దిలీ ప్‌కుమార్‌కు టికెట్ ఇస్తే... ఎంతకైనా తెగిస్తామని పీసీసీ జాబితాలో పేర్లు ఉన్న ముగ్గురు నేతలు స్పష్టం చేస్తున్నారు.
దిలీప్‌కుమార్‌కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయమని... ఆయన స్థానికత అంశాన్ని తెరపైకి తెస్తామని, కాంగ్రెస్ శ్రేణులే ఆయనను ఓడిస్తాయని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పడి పార్టీని బతికించుకున్న తమను కాదని, ఇప్పటికే పదవిలో ఉన్న దిలీప్‌కు ప్రాధాన్యం ఇస్తే సహించలేదని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇన్నాళ్లు పనిచేసిన వ్యక్తికి సీటు ఇస్తే కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేరని వాపోతున్నారు.
పొన్నాల ఏం చేస్తారో...
టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదనే స్పష్టత రావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆశలతో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా... వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్‌ఎల్‌డీ అంశం తెరపైకి రావడం కాంగ్రెస్ ఆశావహుల్లో ఆందోళనపెంచింది. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న వారు ఏకంగా 14 మంది ఉన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రూపొందించిన తుది జాబితాలోనే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, జంగా రాఘవరెడ్డి, పీవీ.రాజేశ్వరరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, హరిరమాదేవి, జి.రమాకాంత్‌రెడ్డి, పి.రామేశ్వరరెడ్డి, పి.హరీందర్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, గంటా నరేందర్‌రెడ్డి, కె.నరేందర్‌రెడ్డి, జి.ప్రకాశ్‌రెడ్డి పేర్లు వరుసగా ఉన్నాయి. ఇంత మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో తుది జాబితాలో ఎంతమంది పేరు పెట్టాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా కేంద్రంలోని నియోజకవర్గం కావడంతో ఈ సీటు విషయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరూ జోక్యం చేసుకోవడంలేదు. ఎవరికి సీటు దక్కినా... అసంతృప్తులకు పొన్నాల లక్ష్మయ్య బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. సొంత పార్టీ అసంతృప్తులపైనే ఆందోళన చెందుతున్న పొన్నాలకు... దిలీప్‌కుమార్ ఈ సీటును ఆశిస్తుండడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో పొన్నాల ఎలా వ్యవహరిస్తారనే అంశం కాంగ్రెస్‌లో చర్చనీయూంశంగా మారింది.