యువ ఇంజనీర్‌ను బలిగొన్న వేధింపులు
- సెలవు మంజూరు చేయమన్నందుకు మెమో..మనస్తాపంతో ఆత్మహత్య
- ఈఈని సస్పెండ్ చేయాలని బంధువుల రాస్తారోకో
వెల్గటూరు: ఆయనో యువ ఇంజనీర్.. ఏడాదిన్నర క్రితం టీఎస్‌పీఎస్ ద్వారా పంచాయతీరాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఏఈగా నియమితుడయ్యాడు. ఎంతో ఆనందం గా ఉద్యోగంలో చేరిన అతడికి.. ఉన్నతాధి కారుల నుంచి వేధింపులు మొదలవ్వడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. సెలవు మంజూరు చేయమని కోరితే.. మెమో జారీ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ముందు రోజే భార్యకు, సదరు అధికారికి సూసైడ్ నోట్‌ను మెయిల్ చేశాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లికి చెందిన దేవి శ్రీకాంత్(30) బుధ వారం తన పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు.
దేవి శ్రీకాంత్ ఆసిఫాబాద్ జిల్లా డివిజన్ పంచాయతీ రాజ్ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్. మంచిర్యాల క్యాంప్ ఆఫీస్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ఉద్యోగంలో చేరిన శ్రీకాంత్‌కు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. చిన్న తప్పును కూడా వేలెత్తి చూపడం.. సంజాయిషీ అడగటం తనను మానసికంగా కుంగదీసిందని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 8 నుంచి 10 వరకు మూడు రోజులు ఉద్యోగానికి వెళ్లకుండా అదృశ్యమయ్యాడు. కుటుంబçసభ్యులు వెతికి పట్టుకుని తిరిగి ఉద్యోగంలో చేర్పించారు.
తన మానసిక పరిస్థితి సరిగా లేనందున మూడురోజులు విధులకు హాజరు కాలేదని, ఆ మూడు రోజులు సెలవు మంజూరు చేయాలని 11న నిర్మల్ జిల్లా ఈఈ రఘువీరారెడ్డికి విన్నవించాడు. ఆయన లీవ్ మంజూరు చేయకపోగా.. అనుమతి లేకుండా ఎందుకు వెళ్లావో వివరణ ఇవ్వాలని మెమో జారీ చేశారు. దీంతో మరింత కుంగిపోయిన శ్రీకాంత్ విధులకు వెళ్లకుండా ఆ రోజునే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు అప్పటి నుంచి వెతుకుతున్నా జాడ దొరకలేదు. అధికా రుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటు న్నానని డీఈకి, భార్యకు ఈ నెల 22న సూసైట్ నోట్‌ను మెయిల్ చేశాడు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అదే రోజున వెల్గటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.
బంధువుల రాస్తారోకో..
ఈఈ రఘువీరారెడ్డి వేధింపుల వల్లే శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ధర్మారం– జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేశారు. ఈఈని సస్పెండ్ చేయాలని, అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతవర్గానికి చెందిన ఈఈ.. దళితుడనే కారణంగానే శ్రీకాంత్‌ను వేధించాడని, అతడిని శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ ముద్దం ప్రకాశ్ డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటేశ్వర్ రావు హామీ ఇవ్వగా.. బంధవులు ఆందోళనను విరమించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు.