
అసెంబ్లీని శాసిస్తున్న హరీశ్, కేటీఆర్
- టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ధ్వజం
- బండారం బయటపడుతుందనే సస్పెండ్ చేశారు
సాక్షి, హైదరాబాద్: శాసనసభను బావ, బావమరుదులు శాసిస్తున్నారని, ఇతర మంత్రులకు మాట్లాడే అవకాశం కల్పించడం లేదని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఏ మంత్రి శాఖ విషయం అయినా తారకరామారావు, హరీష్‌రావు సమాధానాలు ఇస్తూ సభ గౌరవాన్ని మంటగలుపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీడీఎల్‌పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఎ.రేవంత్‌రెడ్డి, వివేకానంద, పార్టీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సోమవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ శాసనసభ నడుస్తున్న తీరును చూసి మేధావులు, ఉద్యమకారులు అసహ్యించుకునే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ‘నా కూతురునే ప్రశ్నిస్తారా’ అనే నిరంకుశత్వంతో ఎమ్మెల్యేలను వారంరోజుల పాటు సస్పెండ్ చేశారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య తీరుకే విరుద్ధమన్నారు.
ఎంపీ కవిత రెండు చోట్ల సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారని నిరూపించే సాక్ష్యాలు ఇచ్చినా, కేటీఆర్ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా, హెరిటేజ్ సంస్థపై విమర్శల మీద వివరాలు ఇచ్చినా స్పీకర్ ఇప్పటి వరకు పట్టించుకోవడంలేదని అన్నారు. సభలో ప్రభుత్వ బండారాన్ని బయటపెడతారన్న భయంతోనే తమ గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లోని లొసుగులు, రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోళ్లకు సంబంధించి తాము సభలో చర్చిస్తామని భయపడే వారం రోజుల పాటు సస్పెండ్ చేశారన్నారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్సేన్‌సాగర్ వద్ద 100 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తానని, కరీంనగర్‌ను న్యూయార్క్ చేస్తానని ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉన్నదే ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టుకొనేందుకని, రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సస్పెండ్ చేసి కొత్త అంకానికి తెరతీశారని ఎద్దేవా చేశారు.
వారం రోజులు సస్పెండ్ చేస్తారా అని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నిస్తే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుపై దాడి చేస్తే కాంగ్రెస్ సభ్యులను రెండేళ్లు సస్పెండ్ చేశారని హోంమంత్రి చెప్పడం విడ్డూరమని విమర్శించారు. తెలంగాణకు చెందిన విద్యాసాగర్‌రావుపై దాడిని హోంమంత్రి సమర్థించడం విచారకరమన్నారు.