శనివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో మాట్లాడుతున్న హరీశ్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు స్వర్ణయుగం ప్రారంభమైందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో తమ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేలా చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ డైమండ్ జూబ్లీ వేడుకలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గిడ్డంగుల నిర్మాణం, గిడ్డంగుల సామర్థ్యంలో దేశంలో తెలంగాణ నంబర్‌వన్ అని చెప్పారు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్, సంస్థ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.
2014లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములుంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోదాముల సామర్థ్యాన్ని 21 లక్షల టన్నులకు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద శాతం ఆక్యుపెన్సీతో దేశంలో తొలి స్థానంలో నిలిపామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసి అవి నిండిన తర్వాతే ప్రభుత్వ గోదాములు నింపేవారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోదాముల్లో నిండిన తర్వాతే ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నింపాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు జీవో ఇచ్చామన్నారు.
ఈ జీవో రాకుండా చాలా ఒత్తిళ్లు వచ్చినా.. గోదాములను నిలబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చామని, మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ వల్ల మరో 12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం వల్ల పంట దిగుబడులు పెరిగాయన్నారు.
జలాశయాలు నిండాయి..
గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో జలాశయాలు నిండాయని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నిండిందనీ, రెండు రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండబోతుందన్నారు. రెండు మూడు రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఎస్సారెస్పీలో తాగునీటికి మాత్రమే నీరు ఉంటే.. సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేశారని చెప్పారు. ఆ నీరు సాగుకు ఇచ్చేస్తే.. వేసవిలో కాంగ్రెస్ నేతలు మళ్లీ తాగునీరు ఇవ్వలేదని రాజకీయం చేసేవారని మండిపడ్డారు.
ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని తెలిపారు. మళ్లీ రైతు బంధు పథకంలో భాగంగా ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పంటలకు మద్దతు ధరతో కందులు, మక్కలు, శనగలు, పెసలు, ఉల్లిని తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. సంస్థ ఆదాయం పెంచితే ఉద్యోగులకు ప్రోత్సాహకం ఇస్తామన్నారు. సంస్థలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామ్యేల్, ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్‌శాఖ సంచాలకులు లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment