కేసీఆర్ బాధపడ్డారు: హరీశ్ రావు
హైదరాబాద్ : బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధపడ్డారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అక్షర సత్యాలని బీజేపీ నేతలే అంగీకరించారని, అయితే ఆయన అడిగిన ప్రశ్నలకు వాళ్లు సమాధానం ఇవ్వలేదని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అమిత్ షా వెళ్లారంటే ఆయన చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయిందన్నారు. వాస్తవాలు ఒప్పుకోవాలని అంతేకానీ ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కేసీఆర్ చెప్పిన అంశాలపై స్పందించలేదని హరీశ్ రావు అన్నారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలకు కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పినా బాగుండేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని, అన్ని రాష్ట్రాలు ఇక్కడి పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని వివరించారు. ప్రభుత్వంపై బురదజల్లితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే సీఎం కేసీఆర్ స్పందించారని స్పష్టం చేశారు. మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరంలో ఉందో.. మీ ఇల్లు మా ఇంటికి అంత దూరంలోనే ఉందని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు.
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హైకోర్టు విభజన, ఇవ్వకున్న ఇచ్చినట్లు చెప్పుకున్న ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీలపై మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లోనే వచ్చిన ఉప ఎన్నికల్లోనే గెలువలేదని, వాళ్ల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చినందుకు బీజేపీ పదేళ్లు వెనక్కి పోయిందని, మోదీ, యోగి రాష్ట్రానికి వస్తే 25 ఏళ్లు వెనక్కి పోవటం ఖాయమని హరీశ్ రావు అన్నారు.
వాస్తవాలు గ్రహించి బీజేపీ నేతలు క్షమాపణ చెప్పి ఉంటే వారికి ప్రజల్లో గౌరవం పెరిగేదని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా బాగా ఉన్నాయన్నారు. ఇక గొల్ల కురవలు గురించి ఆలోచించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామన్నారు. అలాగే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా విద్యుత్ రంగాన్ని మెరుగుపరిచామని హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ...రాష్ట్రానికి ఏ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.