సాక్షి, సిద్దిపేట/నంగునూరు: ‘పూర్వం నాలుగు చెక్కల భూమి ఉంటేనే ఆడపిల్లను ఇచ్చేవారు.. కానీ రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయి. పాలకుల పుణ్యమా అని అన్నదాత అప్పులపాలవుతూ వస్తున్నాడు. దీంతో చిన్నపాటి అటెండర్ ఉద్యోగం ఉన్న వారికైనా తమ బిడ్డను ఇస్తున్నారే తప్ప.. రైతుకు పిల్లనిచ్చే రోజులు పోయాయి.. కాళేశ్వరం పూర్తయితే సాగునీటి కష్టాలు తీరుతాయి. దీంతో పిల్లను ఇస్తే రైతులకే ఇవ్వాలి అనే రోజులు మళ్లీ వస్తాయి’అని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటలో ఏర్పాటు చేసిన రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్న, కందులు, పత్తికి మద్దతు ధరపెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. గతేడాది క్వింటాల్‌కు రూ. 5,400 పెట్టి రూ. 1,400 కోట్లు వెచ్చించి ప్రభుత్వం కందులు కొనుగోలు చేసిందని వెల్లడించారు. తీరా వీటిని అమ్మేందుకు టెండర్లు పిలువగా రూ.600 కోట్లకు మించి రావడంలేదన్నారు. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.800 కోట్లు నష్టం వస్తుందని చెప్పారు. అదేవిధంగా మొక్కజొన్నలు క్వింటాకు రూ.1600 పెట్టి కొనుగోలు చేశామని ఇప్పుడు వాటిని రూ.400 నష్టంతో అమ్ముతున్నామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఇదంతా రైతుల క్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న పనిగా పేర్కొన్నారు.
రైతు బంధు, రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలు ఒకట్రెండు సంవత్సరాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం తమది కాదని.. అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వడగండ్ల వాన, అనావృష్టితో దెబ్బతిన్న పంటలకు బీమా వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఏడాదికి సంబంధించిన పంటలకు రూ.700 కోట్లు బీమా డబ్బులు విడుదలయ్యాయని, ఇందులో రూ. 275 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పారు.
గోదావరి నుంచి సముద్రంలో వృథాగా కలుస్తున్న 500 టీఎంసీల నీటిని తెలంగాణ బీళ్లకు మళ్లించే కాలం దగ్గరలోనే ఉందన్నారు. సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద నీరడిగా ఉంటూ ప్రాజెక్టు త్వరితగతిన నిర్మించేలా పనిచేస్తున్నారని అన్నారు. హరీశ్‌రావు వస్తుంటే గోదావరి జలాలు పారినట్లే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సారయ్య, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
34 మంది పిల్లలకు 8 మంది టీచర్లా?
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇంత అధ్వానంగా ఉంటే మీరేం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 34 మంది విద్యార్థులకు 8 మంది టీచర్లు అవసరమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దన్నపేటలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి గ్రామం లోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎంతమంది విద్యార్థులున్నారని ఇన్‌చార్జి హెచ్‌ఎం రాంప్రభాకర్‌ను అడిగారు. 34 మంది అని సమాధానం చెప్పడంతో మంత్రి ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
ఎని మిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలుసుకొని వారికి నెలకు ఎంత మేరకు వేతనాలు చెల్లిస్తున్నారని పక్కనే ఉన్న ఎంఈవోని ప్రశ్నించారు. సుమారు నాలుగు లక్షలు ఉంటుందని ఆయన సమాధానం ఇవ్వడంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయులు మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు విద్యార్థులు రాకుంటే బడి నడపడం ఎందుకని, ఇక్కడి వారిని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నంగునూరు హైస్కూల్‌లో చేర్పించి రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. మండలంలో ఇంకా ఇటువంటి స్కూళ్లు ఎన్ని ఉన్నాయో తనకు చెప్పాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment