సాక్షి, సంగారెడ్డి: ఢిల్లీలో అయోధ్య రాముని తీర్పు వెలువడింది. సప్త సరస్వతీ సమార్చన కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం దొరికింది. ఇది కాకతాలీయమేమో అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ అన్నారు. శనివారం ఆయన సంగరెడ్డిలో నిర్వహించిన సప్త సరస్వతీ సమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్వకాలంలో రాతి కట్టడాల గురించి విన్నాం.. ఇక్కడ మహేశ్వర సిద్ధాంతి నిర్మించి చూపిస్తున్నారని ప్రశంసించారు. ఒక చారిత్రాత్మక కట్టడం ఊహకందనిదని.. ఆలయంలో 236 ప్రత్యేకతలు ఉన్నాయని, నిజంగా ఇది అద్భుతం అంటూ కొనియాడారు. 25 వేల దేవతామూర్తులతో సంగారెడ్డిలో ఆలయ నిర్మాణం జరగడం సంగారెడ్డి ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఈ దేవాలయం త్వరితగతిన పూర్తి చేసేలా తాన వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
మానవసేవయే మాధవ సేవ అని.. ఈ సూక్ష్మమైన విషయాన్ని మరిచి మనిషి ఎండమావుల వెంట పరిగెడతాడని ఆయన అన్నారు. మనిషి జీవితంలో చేసిన మంచి పనులే చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. మానసిక ప్రశాంతత కేవలం దైవ సన్నిధిలోనే పొందగలుగుతామని పేర్కొన్నారు. ఎంత చేసినా, ఎన్ని పదవులు అనుభవించినా మానసిక ప్రశాంతత లేకుంటే వృధానే అని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య తీర్పు ఈ రోజు వెలువడిందని.. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ అద్భుతమైన సరస్వతీ సమార్చన జరగడం సంతోషంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment