24 గంటలే గడువు | harish rao talks on loans reschedule | Sakshi
Sakshi News home page

24 గంటలే గడువు

Published Tue, Oct 14 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

హరీష్‌ రావు

హరీష్‌ రావు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇప్పటి వరకు రైతుల రుణాలను రీ షెడ్యూల్  చేయని బ్యాంకులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు 24 గంటల గడువు ఇచ్చారు. 24 గంటల్లో రైతు రుణమాఫీలో ప్రగతి చూపించకపోతే ఆయా బ్యాంకుల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఖాతాలను ఉపసంహరించుకుంటామని ఆయన హెచ్చరించారు. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్‌సీస్, కరూర్ వైశ్యా, ఐఎన్‌జీ వైశ్యా,  లక్ష్మి, పంజాబ్, విజయాబ్యాంకులు ఇప్పటివరకు ఒక్క రైతురుణం మాఫీ చేయకపోవడంపై మంత్రి మండిపడ్డారు.

ఈనెల 12 ‘సాక్షి’లో  ‘అప్పు తీర్తదో.. లేదో? అందోళనలో అన్నదాతలు ’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి మంత్రి హరీష్‌రావు స్పందించి, మంగళవారం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతు రుణమాఫీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షత వహించిన ఈ సమీక్షకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు  కిష్టారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి. బాబూమోహన్, చింతా ప్రభాకర్‌తో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా రెవిన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు హాజరయ్యారు. ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ అధికారులు రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని, రుణాల కోసం ఆ బ్యాంకులకు వెళ్తున్న రైతులకు అన్ని జాతీయ బ్యాంకుల నుంచి ఎన్‌ఓసీ తీసుకురావాలంటూ నిబంధన విధిస్తున్నాయని రెవిన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..  రైతు రుణాల రీషెడ్యూల్ కింద  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.499 కోట్లు బ్యాంకర్లు  జమ చేసుకొని,  రైతులకు తిరిగి కొత్త రుణాలు అందించినపుడే రైతు రుణాలు మాఫీ అయినట్లుగా భావిస్తామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 25 శాతం రీ షెడ్యూల్ డబ్బును తమ ఖాతాల్లో జమ చేసుకున్న బ్యాంకులు, రైతులకు తిరిగి రుణాలు ఇవ్వడంతో తాత్సారం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు రూ.50 వేలకు తగ్గకుండా, రూ.70 వేలకు మించకుండా రుణాలు మాఫీ చేయాలని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులతో  ఒప్పదం కుదిరిందని, అప్పుడే విధి విధానాలు కూడా రూపొందించామన్నారు. వాటిని అమలు చేయకుండా బ్యాంకు బీఎంలు ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలను అమలు చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.

మరో 10-15 రోజుల్లో బ్యాంకు అధికారులతో మరోసారి సమీక్షిస్తామని, అప్పటి కూడా  బ్యాంకర్ల ప్రవర్తనలో మార్పులు రాకపోతే ఆర్‌బీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రతిరోజు రైతు రుణాల ప్రగతిపై  టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. అవసరమైతే తాను కూడా బ్యాంకులను సందర్శించి రుణాలమాఫీ ప్రగతిని సమీక్షిస్తానన్నారు. రుణాల మాఫీ విషయంలో బ్యాంకర్లకు రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సహకరిస్తారని, ఈ రెండు శాఖల అధికారులు 15 రోజుల పాటు స్థానికంగా ఉంటూ రైతులకు రుణాలందేలా కృషి చేయాలన్నారు.

అమర వీరుల పట్ల మానవతా దృక్పథం చూపండి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. రుణమాఫీ సమావేశంలోనే రెవెన్యూ అధికారులతో మాట్లాడిన హరీష్‌రావు అమరవీరుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా 2000 సంవత్సరం నుంచి 2009 వరకు ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదని, 2009 నుంచి 2014 వరకు 52 మంది తెలంగాణ సాధనలో అమరులైనట్లు డీఆర్‌ఓ ప్రకటించారు. దీనిపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది అమరవీరుల పేర్లు గల్లంతయ్యాయని, పునఃపరిశీలన చేసి మరో ఫైల్ సిద్ధం చేయాలని మంత్రి వారిని ఆదేశించారు. ఉద్యమ సమయంలో పోరాటం చేసిన 105 మంది యువకులపై  కేసులు ఉన్నట్లు ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ నివేదించగా, మరోసారి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement