సాక్షి, హైదరాబాద్: కొలువుల కొట్లాట పేరిట ఈనెల 31న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి కోసం టీజేఏసీ చేసుకున్న దరఖాస్తుపై పోలీసుల స్పందనను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. కొలువుల కొట్లాట సభకు అనుమతిచ్చేలా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.కోదండరాం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని గురువారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ విచారించారు. పిటిషనర్ అభ్యర్థనపై ఏ నిర్ణయం తీసుకున్నదీ వివరాలు సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించారు.
‘కొట్లాట’అనే పదాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని న్యాయమూర్తి పిటిషనర్‌ను ప్రశ్నించారు. కొట్లాట అంటే స్ట్రగుల్ అనే భావాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ న్యాయవాదులు రవిచందర్, రచనారెడ్డిలు చెప్పిన జవాబుతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. ‘కొలువుల కొట్లాట’అనే శీర్షికపై పోలీసులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిటిషనర్‌ను కోరితే వివరణ ఇచ్చుకుంటారని వారు చెప్పారు. శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇస్తున్నా పోలీసులు నిర్ణయం చెప్పడం లేదని, అందుకే కోర్టును ఆశ్రయించాల్సివచ్చిందని రవిచందర్ చెప్పారు. పిటిషనర్ దరఖాస్తుపై పోలీసులు ఏనిర్ణయం తీసుకున్నారో తెలియజేసేందుకు సోమవారం వరకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది బీఎస్ ప్రసాద్ కోరారు. దాంతో కేసు విచారణ 30వ తేదీకి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment