ఆమె వెనుక అతను.. | He was behind her .. | Sakshi
Sakshi News home page

ఆమె వెనుక అతను..

Published Sun, Jul 20 2014 12:44 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

He was behind her ..

ఉద్యోగం పురుష లక్షణం.. రాజకీయాలూ వారికే సొంతం.. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆడాళ్లూ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఆ దూకుడు వెనకాల పురుషుల ప్రోత్సాహమూ ఉంది. వంటిల్లు దాటి చట్టసభల్లోకి అడుగుపెట్టినా.. తమ భర్తల ఆదరణ లేనిదే ఇదంతా సాధ్యం కాలేదంటున్నారు వారు. భర్త అంటే భరోసా ఇచ్చేవారే కారు.. అన్నింటా వెన్నంటి ఉండేవారని నిరూపించారు. రాజకీయాల్లో తమ విజయం తమ భర్తల వల్లే సాధ్యమైందని సగర్వంగా చాటుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల విజయంపై ఈ వారం సండే స్పెషల్..

 

 


శోభారాణి : జెడ్పీ చైర్‌పర్సన్
నిర్మల్ :
సాధారణ గృహిణి స్థానం నుంచి భర్త ప్రోత్సాహంతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థాయికి ఎదిగారు వల్లగొండ శోభారాణి. భర్త సత్యనారాయణగౌడ్ 25 ఏళ్లుగా రాజకీయాల్లో వివిధ పదవులు చేపట్టారు. ఇప్పుడామెకు అన్ని విధాలా తోడూనీడగా నిలుస్తున్నారు. శోభారాణి తల్లిదండ్రులు ఎల్లాగౌడ్, గోపమ్మలది భైంసా. వీరిది వ్యవసాయ, వ్యాపార కుటుంబం. అక్టోబర్ 28 1965లో జన్మించిన ఆమెకు ఇంటర్మీడియట్ పూర్తయిన అనంతరం నిర్మల్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన వల్లగొండ సత్యనారాయణగౌడ్‌తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అందులో పెద్ద కుమార్తె డాక్టర్ కృప అరవింద్, రెండో, మూడో కుమార్తెలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు శృతి రాకేశ్, కృషి. సత్యనారాయణగౌడ్ కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినది.

సత్యనారాయగౌడ్ తండ్రి గోవింద్‌గౌడ్ నిర్మల్ మండలం కడ్తాల్ గ్రామ సర్పంచ్‌గా రెండుసార్లు పనిచేశారు. అనంతరం సత్యనారాయగౌడ్ 1988లో కడ్తాల్ సర్పంచ్‌గా, 1995లో నిర్మల్ ఎంపీపీగా, 2004 వరకు కాకతీయ యూనివర్సిటీ పాలకవర్గ సభ్యులుగా పనిచేశారు. 2004లో టీడీపీ నుంచి నిర్మల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అనంతరం రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో క్రియాశీలకంగా పాలుపంచుకున్నారు.

ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈసారి నిర్మల్ జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో సత్యనారాయణగౌడ్ తన భార్య శోభారాణిని బరిలో నిలపాలని పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనను కోరారు. ఈ క్రమంలో శోభారాణిని జెడ్పీటీసీగా బరిలో నిలవడం, గెలుపొందడం, జెడ్పీ చైర్‌పర్సన్ అవడం జరిగిపోయాయి. వీటన్నింటిలోనూ తన భర్తే వె న్నుదన్నుగా ఉన్నారని చెప్తున్నారు శోభారాణి.
 
కోవ లక్ష్మి : ఎమ్మెల్యే-ఆసిఫాబాద్
ఆసిఫాబాద్ :
ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోవ లక్ష్మి రాజకీయ ప్రస్థానం ఎంపీటీసీ నుంచి మొదలైంది. భర్త సోనేరావు ప్రోత్సాహంతోనే ఎంపీటీసీ నుంచి ప్రారంభమై ఎమ్మెల్యే స్థాయికి  ఎదిగారు. ఐదోసారి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(కాంగ్రెస్)పై విజయం సాధించింది. ఓటమి ఎరుగని ధీరురాలిగా నిరూపించుకుంది. వాంకిడి మండలం బంబార గ్రామానికి చెందిన దివంగత మాజీ గిరిజన మంత్రి కొట్నాక భీమ్‌రావు, భీమ్‌బాయిల కుమార్తె కోవ లక్ష్మి. పదో తరగతి వరకు చదివారు. తిర్యాణి మండలం పంగిడి మాదర పంచాయతీ భీమ్‌గూడకు చెందిన కోవ సోనేరావుతో 1986లో వివాహమైంది. సోనేరావు ప్రస్తుతం ఆసిఫాబాద్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు సాయినాథ్(ఎంబీఏ), కుమార్తెలు అరుణ డిగ్రీ, కామేశ్వరి లా చదువుతున్నారు.
 
రాజకీయ ప్రస్థానం
కోవ లక్ష్మి 1995లో మొట్టమొదటిసారిగా టీడీపీ నుంచి తిర్యాణి మండలం పంగిడి మాదర ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. రెండో సారి 2001లో అదే స్థానం నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి తిర్యాణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. భర్త సోనే రావు ఉద్యోగ రీత్యా  ఆసిఫాబాద్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో 2006 స్థానిక ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వ్ చేసిన ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊపందుకున్న సమయంలో 2010లో టీఆర్‌ఎస్‌లో చేరారు.

నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ అధిస్టానం బాధ్యతలప్పగించారు. గతేడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో రెండోసారి ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పోటీ చేసి సోదరి మర్సుకోల సరస్వతీపై విజయం సాధించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. తన భర్త సోనేరావు ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో రాణిస్తూ, ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని కచ్చితంగా చెప్తున్నారు లక్ష్మి. నాన్నలాగే గిరిజన మంత్రి కావడమే తన లక్ష్యమంటున్నారు.
 
కళావతి :ఎంపీపీ-చెన్నూర్
చెన్నూర్ :
పట్టణానికి చెందిన మైదం కళావతి భర్త మైదం రవి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే భార్యను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించారు. గృహణిగా ఉన్న కళావతిని రాజకీయరంగ ప్రవేశానికి ప్రోత్సహించారు. రవి ప్రోత్సాహంతో రెండుసార్లు ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. కళావతిని 2006లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 7వ ఎంపీటీసీ స్థానంలో పోటీకి నిలబెట్టి గెలిపించారు.

రిజర్వేషన్ అనుకూలించడంతో చెన్నూర్ మండల ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆమె ఎంపీపీ హోదాలో మండల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారు. 2014లో చెన్నూర్ ఎంపీపీ జనరల్ మహిళకు కేటాయించడంతో మళ్లీ  చెన్నూర్ పట్టణంలోని 6వ ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. భర్త ప్రోత్సాహంతోనే రెండుసార్లు ఎంపీపీగా, ఒకసారి సర్పంచ్‌గా ఎనికయ్యానంటున్నారు కళావతి.
 
మీరాబాయి : ఎంపీపీ-ఇంద్రవెల్లి
ఇంద్రవెల్లి : భర్త
కృషితోనే ఎంపీపీ అయ్యానని జాదవ్ మీరాబాయి చెప్తున్నారు. ఆమె భర్త జాదవ్ ప్రకాశ్ వ్యవసాయం చేస్తూనే పదేళ్లుగా టీఆర్‌ఎస్ నాయకుడిగా ఉ న్నారు. ప్రజా క్షేత్రంలో ఆయన నడిచిన దారులు భార్య మీరాబాయి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యేందుకు ఉపాయోగపడ్డాయి. 2006 నుంచి 2011 వరకు కేస్లాపూర్ సర్పంచ్‌గానూ పనిచేశారామె. భర్త సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నారు.
 
బుక్యా అమ్మీబాయి : ఎంపీపీ-కడెం
కడెం :
మండలంలోని చిట్యాల పంచాయతీ పరిధి లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన బుక్యా అమ్మీబాయి-బాపురావు దంపతులు కలిసి ప్రజా ప్రతినిధులుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అమ్మీబాయి కుటుంబానికి రాజకీయ సంబంధాలున్నాయి. గతంలో అత్త అమ్మీబాయి గ్రామ సర్పంచుగా పనిచేసింది. అలా ఆమె భర్త బాపురావు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కడెం జెడ్పీటీసీ స్థానం మహిళలకు రిజర్వు అయింది. అప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు అమ్మీబాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మళ్లీ టీడీపీలోకి వచ్చారు. జెడ్పీటీసీగా ఐదేళ్లు కొనసాగారు. కడెం ఎంపీపీ స్థానం మహిళలకు రిజర్వు కావడంతో ఎంపీటీసీగా పోటీ చేసి అధ్యక్ష పదవి అందుకున్నారు.
 
రాథోడ్ యోగిత :ఎంపీపీ-కుభీర్
కుభీర్ :
కుభీర్ ఎంపీపీ రాథోడ్ యోగిత తాను భర్త కంలేశ్ ప్రొత్సాహంతోనే ఎంపీపీ కాగలిగానని తెలిపారు. ఇంటర్ వరకు చదివిన తనను భర్తే ప్రోత్సహించి డిగ్రీ చేయిస్తున్నారని చెప్పారను. రాజకీయాల్లోకీ ఆయనే తీసుకువచ్చారని, ప్రచార బాధ్యతలు పూర్తిగా ఆయనే చూసి ఇటీవలి ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచేలా చేశారని తెలిపారు. ఎంపీపీ ఎన్నికకు అవసరమైన అన్ని విషయాలు ఎంపీటీసీలతో మాట్లాడి ఎంపీపీని చేశారని పేర్కొన్నారు. భర్త సహకారం మరువలేనిదంటున్నారామె.
 
గంగామణి : ఎంపీపీ-కుంటాల
కుంటాల : 
కుంటాల మండలం అందాకూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి బుచ్చన్న ప్రోత్సాహంతో ఆమె భార్య గంగామణి ఎంపీపీగా గెలుపొందారు. సర్పంచ్‌గా పనిచేస్తున్న బుచ్చన్న ప్రజాసేవకు అంకితం కాగా.. భార్య గంగామణి కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు. మహిళా రిజర్వేషన్ల అనుకూలించి భర్త ప్రోత్సాహంతో ఎంపీటీసీగా విజయం సాధించారు. రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా గంగామణిని ఎంపీపీ పదవి వరించింది. ఇదంతా భర్త కృషితోనే సాధ్యమైందంటున్నారు గంగామణి.
 
మనీషా :మున్సిపల్ చైర్‌పర్సన్-ఆదిలాబాద్
ఆదిలాబాద్ కల్చరల్ :
జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్‌కు చెందిన రంగినే ని లక్ష్మణరావు గతంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పనిచేయగా.. ప్రస్తుతం ఆయన కోడలు మనీషా చైర్ పర్సన్‌గా గెలుపొందారు. భర్త పవన్‌రావు సహకారం, మామ లక్ష్మణ్‌రాంవు ప్రోత్సాహంతో తాను విజయం సాధించానని మనీషా అంటున్నారు. కాగాచ మనీషా ఆదిలాబాద్‌లోని బాలాజీ విద్యామందిర్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. మొదటిసారి కౌన్సిలర్ గెలిచి చెర్మైన్‌గా ఎన్నికయ్యారు. మొదటిసారిగా రాజకీయంలో ఉన్నత పదవిని అలంకరించించారు. మామ లక్ష్మణ్‌రావు సలహాలు సూచనలను తీసుకుంటూ.. భర్త అండదండలతో ఆదిలాబాద్ ప్రజలకు సేవనందించెందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొంటున్నారు. కేవలం ప్రజా సేవేలక్ష్యంగా ముందుకు సాగుతామని చెబుతున్నారు.
 
ఉన్నత విద్యాభ్యాసం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాల్లోని మున్సిపల్ చైర్ పర్సన్ల విద్యార్హతతో పోలిస్తే మనీషా ముందంజలో ఉంది. ఎమ్మెస్సీ, ఎఈడీ చదివారు. అందరికంటే ఉన్నత విద్యభ్యాసించిన చైర్‌పర్సన్‌గా గుర్తింపు ఉంది. ఆమెది జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామం. అంతేకాక చిన్న వయసులోనే ఆదిలాబాద్ మున్సిపల్ చెర్మైన్‌గా పగ్గాలు చేపట్టారు. ఇప్పటివరకు 30 ఏళ్లలోపు వయసు వారు చైర్ పర్సన్‌గా పనిచేయడం ఇదే తొలిసారి.
 
వసుంధర : మున్సిపల్ చైర్‌పర్సన్ -మంచిర్యాల
మంచిర్యాల టౌన్ :
మామిడిశెట్టి వసుంధర భర్త రమేశ్ సహకారంతో మంచిర్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అయ్యారు. చెన్నూర్‌కు చెంది న వసుంధరకు 1995 మే 4న వి వాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సాత్విక్, రిత్విక్. రమేశ్ కౌన్సిలర్ గా, కో ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. ఇంటర్మీడియెట్ వరకు చదివిన వసుంధర భర్త సహకారంతో 2005లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి బల్దియా ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా ఎ న్నికయ్యారు. 2014లోనూ టీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యా రు. అనూహ్యంగా పట్టణ ప్రథమ పౌరురాలి(చైర్ పర్సన్)గానూ ఎన్నికయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం. ఆ ప్రభావంతో క్రమేపీ రాజకీయాలకు ఆకర్షితులవ్వడం. తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడం, భర్త తోడ్పాటు ఆమెకు ఈ పదవి కట్టబెట్టాయి. ప్రజా సేవ పరమావధిగా భావించిన భర్త రమేశ్ సూచన, ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకున్న వసుంధర రాజకీయాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నిక కావడంలో భర్త సహకారం ఎంతగానో ఉందని అంటున్నారామె. పట్టణ ప్రథమ పౌరురాలిగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు వసుంధర.
 
మున్సిపల్ చైర్‌పర్సన్-బెల్లంపల్లి : సునీతారాణి
బెల్లంపల్లి :
రాజకీయాల్లో రావడానికి భర్త మహేశ్‌కుమార్ తోడ్పా టు ఎంతో ఉందని ఆయన ప్రో ద్బలంతోనే రాజకీయ అరంగే ట్రం చేశానని బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పి.సునీతారాణి చెప్తున్నారు. సునీతారాణిది కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం గుట్రాజ్‌పల్లి. అమ్మ, నాన్న లక్ష్మి-గంగారాం. ఇంటర్మీడియెట్ వరకు చదివారు. మోహన్‌కుమార్, మల్లేశ్వర్, ప్రవీణ్‌కుమార్ తమ్ముళ్లు. ఇందులో చిన్నవాడైన ప్రవీణ్‌కుమార్ గట్రాజ్‌పల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌గా, అమ్మ లక్ష్మి వార్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మహేశ్‌కుమార్‌తో పదిహేనేళ్ల క్రితం జరిగింది.

వ్యవసాయం, టైలరింగ్ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు తొలుత రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. మరిది పసుల సురేశ్ టీఆర్‌ఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పలువురు ప్రజలకు వారింటికి వెళ్లి తాము ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు సురేశ్, ఆమె భర్త మహేశ్‌కుమార్‌తో చర్చించేవారు. ఈ క్రమంలో ఆమెకూ రాజకీయాలపై ఆసక్తి కలిగింది. భర్త ప్రోత్సాహంతో బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. భర్త తోడ్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని అంటున్నారు సునీతారాణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement