మాజీలకు సారథ్యం!
టీపీసీసీ, డీసీసీల్లో మార్పులపై సోనియాకు నివేదిక
పార్టీ బలోపేతానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలన్న దిగ్విజయ్, కుంతియా
పునర్నిర్మాణంపై అధిష్టానం దృష్టి
హైదరాబాద్: ‘ చే’జారి పోతున్న నేతలను కాపాడుకోవడం.. చిక్కిశల్యమైన పార్టీకి కొత్త జవసత్వాలను సమకూర్చడం.. ప్రధాన ప్రతి పక్ష పాత్రను సమర్థంగా నిర్వహించడం.. ప్రజ లకు చేరువయ్యేందుకు ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేయడం.. ఇలా బహుముఖ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ను గాడిన పెట్టాలని సూచిస్తూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదిక అందింది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్, ఆయన డిప్యూటీ కుంతియాలు ఈ నివే దికను రూపొందించారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని లోపాలను సరిదిద్ది.. గాడిన పెట్టడానికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
టీపీసీసీ పునర్నిర్మాణం..
రాష్ట్ర విభజన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన అధిష్టా నం ఆ తర్వాత టీపీసీసీ పున ర్నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్‌ను పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు మాత్రమే మాజీ మంత్రులు దానం నాగేందర్, సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు గా మాజీలకే సారథ్య బాధ్యతలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయానికి నా యకత్వం వచ్చినట్లు చెబుతున్నారు. నల్లగొండ లో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి వంటి సీనియర్లు ఉన్నారు. వరంగల్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, సీనియర్ గండ్ర వెంకటరమణారెడ్డి, బస్వరాజు సారయ్య, కరీంనగర్‌లో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, నిజామాబాద్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డిలో మాజీ మంత్రులు ప్రసాద్, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలు ఉన్నారు. ఈ స్థాయి నాయకుల సేవలు వినియోగించుకోవడం ద్వారా జిల్లాల్లో పార్టీ కేడర్ సైతం ఉత్సాహంగా పనిచేస్తారన్న అభిప్రాయం ఉంది.
రాష్ట్ర స్థాయిలోనూ... : టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గంలోనూ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శు లు, అధికార ప్రతినిధులు తదితర పదవులను సీనియర్లు అయిన మాజీ నేతలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారితో భర్తీ చేయడంతో పార్టీ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయవచ్చనే భావన ఉన్నట్లు చెబుతున్నారు. సీఎల్పీ భేటీ అనంతరం కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కూడా అధినే త్రి సోనియాని కలిశారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీమంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ రాజయ్య, నల్లగొండకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు పొన్నాల లక్ష్మయ్య నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. డిసెంబరు 31వ తేదీ వరకు పార్టీ సభ్య త్వ నమోదు కార్యక్రమం ఉంది కనుక వచ్చే ఏడాది జనవరిలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.