నమాజ్‌తో.. ఆరోగ్య భాగ్యం | health blessedness with namaz | Sakshi
Sakshi News home page

నమాజ్‌తో.. ఆరోగ్య భాగ్యం

Published Mon, Jun 30 2014 11:29 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

నమాజ్‌తో.. ఆరోగ్య భాగ్యం - Sakshi

నమాజ్‌తో.. ఆరోగ్య భాగ్యం

 

  • ఆధ్యాత్మికతతోపాటు ప్రశాంతత
  • ప్రతి క్రియలోనూ  వ్యాయామ గుణాలు

 తాండూరు:  దైవ ప్రసాదితమైన దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన పవిత్ర మాసం రంజాన్. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలం, భక్తిపరాయణత్వం, మనోనిశ్చలత, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్. ఈ నెలరోజుల పాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేస్తుంటారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రంజాన్ వేడుకలకు మసీదులు సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి రంజాన్ నెల ప్రారంభమైంది. ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ చేయడంలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.  
 
రోజుకు ఐదుసార్లు నమాజ్
నమాజ్ చేయడం వల్ల దైవాజ్ఞను ఆచరించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నమాజ్‌లోని ప్రతి క్రియలో వ్యాయామ గుణాలు ఉన్నాయి. వేకువజామున చేసే నమాజ్‌ను ఫజర్ అని, మధ్యాహ్నం జోహర్ అని, సాయంత్రం అసర్, సూర్యాస్తమయం వేళ మగధిట్, రాత్రి నమాజ్‌ను జషానమాజ్ అని అంటారు. నమాజ్‌లో తక్బీర్, ఖియామ్, రుకూ, సజ్దా, జల్సా, సలామ్ అనే క్రియలు ఉంటాయి. నమాజ్ చేసినప్పుడల్లా వీటిని తప్పక పాటిస్తారు.  
 

 

తక్బీర్
నమాజ్ ప్రారంభానికి సంకల్పం తర్వాత రెండు చేతులు చెవులు వరకు పెకైత్తి అనంతరం కిందకు దించి నాభిపైన రెండు చేతులు కట్టుకోవాలి. ఈ క్రియ వలన చేతిబలం పెరుగుతుంది. దేవుని సమక్షంలో ఉన్నామని అల్లా తమను గమనిస్తున్నాడనే భావన కలుగుతుంది.
 
 

 

 

ఖియామ్
అల్లాహు అక్బర్ అని తక్బీర్ చెబుతూ.. కుడిచేతి బొటన, చిటికెన వేళ్లతో ఎడమచేతి మణికట్టును నాభిపై ఉంచుకోవాలి. ఈ క్రియ ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నిష్కల్మష ఆరాధనతో దైవంపై మనసు లగ్నం చేస్తే దొరికే ప్రశాంతత వర్ణనాతీతం. ప్రశాంత మనసు కలిగిన వ్యక్తికి రోగాలు ఆమడ దూరంలో ఉంటాయి.  
 
 

 

రుకూ
రెండు చేతులూ మోకాళ్లపై ఉంచుతూ నడుమును సమాంతరంగా వంచుతూ చూపును రెండు కాళ్ల బొటనవేళ్ల మధ్యన ఉంచాలి. ఈ క్రియ ఉదరభాగానికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. బొటన వేళ్ల వద్ద ఉన్న చూపుకు ఉత్తేజం కలుగుతుంది. ఇది వెన్నెముకకు మంచి వ్యాయామం.
 
సజ్దా
పాదాలు, మోకాళ్లు, అరచేతులు, ముక్కు, నుదురు, నేలను తాకిస్తూ దైవం సమక్షంలో అష్టాంగ ప్రమాణం చేయడం. ఈ క్రియ ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి వ్యాయామం దొరుకుతుంది. సజ్దా చేసే సమయంలోనూ, అందులోంచి లేచే సమయంలోనూ ఛాతీకి మంచి వ్యాయామం లభిస్తుంది. భుజాలు బలోపేతమవుతాయి.
 
జల్సా
సజ్దా నుంచి లేచి రెండు కాళ్లను మడిచి కాళ్లను, మోకాళ్ల వరకు తాకిస్తూ వాటిపైన కూర్చుంటారు. ఈ క్రియ వజ్రాసనాన్ని పోలి ఉంటుంది. ఈ క్రియ వల్ల శరీరం గట్టిపడుతుంది. 72 వేల నాడులు ఇందులో పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
 
 

సలామ్
నమాజ్ పూర్తయ్యే సమయంలో తలను ఒకసారి కుడివైపు తిప్పి సలాం చేస్తారు. అనంతరం ఎడమ వైపునకు తిప్పి సలాం చేసి నమాజ్‌ను ముగిస్తారు. ఈ క్రియ వల్ల గొంతు, మెడకు మంచి వ్యాయామం. నేత్ర శక్తి పెంపొందుతుంది. మెదడు ఉత్తేజితమవుతుంది.  
 
 

 

ప్రవర్తనలో మార్పు
రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం నమాజు చేయడం వల్ల వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. రంజాన్‌లో దైవ ప్రార్థనలు, ఫిత్రాదానాలు చేస్తారు. మిగిలిన రోజుల కంటే రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా నమాజ్, ఖురాన్ పఠనంలో నిమగ్నమవుతారు. పాపపరిహారాల కోసం ఇది అనువైన సమయం. మహిళలు ఇళ్లవద్దనే ఖురాన్‌ను పటిస్తూ ఐదు పూటలా నమాజ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.  
 - హరున్ రషీద్‌ఖాన్, తాండూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement