సాక్షి, శ్రీశైలం: కార్తీకమాసం చివరి రోజు, చివరి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడి పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించారు.
వేకువ జాము నుంచే క్యూలైన్లో వేలాదిమంది భక్తులు శివుని దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శీఘ్రదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు.
తిరుపతిలో..
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపారాధన చేశారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చివరి సోమవారం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
శ్రీకాళహస్తిలో..
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం స్వర్ణముఖి నదిలోకి కార్తీక దీపాలు వదిలిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా గోదావరి ఘాట్‌లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రిలో ఉమా మార్కండేయ స్వామి ఆలయం భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ద్రాక్షారామ భీమేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా..
పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment