బాంబు పేలుడుతో కన్వెన్షన్ సెంటర్ నుంచి భయంతో పరుగులు తీస్తున్న జనం
కొచ్చి: కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు ఆదివారం ఉదయం వందలాది మంది ‘జెహోవా’ క్రైస్తవులు తరలివచ్చారు.
అందరూ ప్రార్థనల్లో ఉండగా, ఉదయం 9.40 గంటలకు హఠాత్తుగా పేలుడు జరిగింది. కొద్దిసేపటికే మరోరెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో జనమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మంది రక్తమోడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మొదటి రెండు పేలుళ్లు శక్తివంతమైనవిగా, మూడోది తక్కువ తీవ్రత కలిగిన పేలుడుగా పోలీసులు గుర్తించారు.
పేలుళ్ల కోసం దుండగులు ఐఈడీ ఉపయోగించినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. పేలుళ్లకు కారణమైన ముష్కరులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని డీజీపీ స్పష్టంచేశారు. పేలుళ్ల సమాచారం తెలియగానే కేరళ రాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
కేరళ గవర్నర్ దిగ్భ్రాంతి
క్రైస్తవుల మత ప్రార్థనల్లో పేలుళ్లు జరగడం పట్ల కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేలుళ్ల ఘటన అత్యంత దురదృష్టకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు.
పేలుళ్లకు తానే కారణం అంటూ వ్యక్తి లొంగుబాటు
కలామాస్సెరీలో తానే వరుస పేలుళ్లకు పాల్పడ్డానంటూ ఓ వ్యక్తి ఆదివారం కేరళలోని త్రిసూర్ జిల్లా కొడాకర పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తాను కూడా ‘జెనోవా’ సభ్యుడినేనని చెప్పారు. లొంగిపోయిన వ్యక్తి పేరు డొమినిక్ మార్టిన్ అని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు తానే కారణం అంటూ కొన్ని ఆధారాలు చూపించాడని వెల్లడించారు. అతడు చెప్పేది నిజమేనా? అనేది క్షుణ్నంగా విచారిస్తున్నామని అన్నారు.
కళ్ల ముందు అగ్నిగోళం కనిపించింది
కలామస్సెరీలో మత ప్రార్థనల్లో జరిగిన పేలుళ్లను తల్చుకొని ప్రత్యక్ష సాక్షులు బెంబేలెత్తిపోతున్నారు. తాను కళ్లు మూసుకొని పార్థన చేస్తున్నానని, హఠాత్తుగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ఓ మహిళ చెప్పారు. వెంటనే ఉలిక్కిపడి కళ్లు తెరిచానని అన్నారు. కళ్ల ముందు భగభగ మండుతున్న ఒక అగి్నగోళం కనిపించిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment