
కర్నూలు సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న మహిళలు
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే ప్రముఖ చర్చిల్లో ఏసుక్రీస్తు జనన దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి కేక్‌లు కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఫాదర్లు పండుగ సందేశాన్ని వివరించారు. విజయవాడలోని గుణదల మేరి మాత పుణ్యక్షేత్రంలో రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం సమష్టి దివ్య బలిపూజ సమర్పించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు నడిచిన మార్గంలో పయనించాలని గుంటూరు జిల్లా మేత్రాసన గురువులు చిన్నాబత్తిన భాగ్యయ్య పిలుపునిచ్చారు. భక్తి గీతాలాపనలు, క్రిస్మస్ సందేశాలు, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలతో బాల ఏసు నగరోత్సవం ఆద్యంతం పలు ప్రాంతాల్లో కన్నుల పండువగా సాగింది. ఏసు జనన నాటిక, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొన్నారు.
క్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి : శాంతి, కరుణ, సహనం, ప్రేమలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్ భవన్ దర్బార్ హోలులో ఆదివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయం అన్నారు.
మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించడమే నిజమైన సంతోషమన్నారు. శాంతి, స్వేచ్ఛ, ఆనందానికి ఏకైక మార్గం ప్రేమ మాత్రమేనని.. ద్వేషాన్ని ప్రేమతో, కోపాన్ని దయతో భర్తీ చేసినప్పుడు జీవితంలో మరింత శాంతిని పొందగలుగుతారని వివరించారు. బిషప్ రాజారావు సందేశం ఇచ్చారు. అనంతరం మత పెద్దలు పాకలపాటి ప్రభాకర్, మట్టా జయకర్, ఎబినేజర్ తదితరులు గవర్నర్‌ను ఘనంగా సన్మానించారు. వారికి గవర్నర్.. మదర్ థెరిస్సా మెమోంటోలను బహూకరించారు.