సాక్షి, హన్మకొండ : హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌కు మంజూరు చేరుుంచి పట్టు నిలుపుకున్న ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య.... జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలను అరికట్టడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన రాజయ్య స్వయంగా ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జిల్లాలోని పేద ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ... సొంత జిల్లాలోనే వైద్య ఆరోగ్యశాఖ గాడిలో పడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. వర్షాకాలం ముగిసిన తర్వాత జిల్లాలో విషజ్వరాలు విజృంభించడంతో ఇప్పటివరకు సుమారు 30కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా గిరిజనగూడేలు, తండాలు విషజ్వరాల బారిన పడుతున్నాయి. వైద్య సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించకపోవడం వల్ల జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. వైద్య సిబ్బంది మేల్కొని చర్యలు చేపట్టేలోగా... మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వారం క్రితం హసన్‌పర్తి మండలం హరిశ్చంద్రనాయక్ తండా మొత్తం విషజ్వరాల బారిన పడగా... ప్రస్తుతం పాలకుర్తి మండలం వావిలాల గ్రామ పంచాయతీ పరిధి భూక్యాతండాలోని ప్రతి కుటుంబంలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ గ్రామంలో జ్వరాల బారిన పడిన ఒకరు శనివారం మృతి చెందారు.
ఏజెన్సీలో వేధిస్తున్న సిబ్బంది కొరత
మౌలిక సదుపాయలు అరకొరగా ఉండే ఏజెన్సీలో వైద్య పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా... ఇక్కడ వైద్య సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ములుగు ఏజెన్సీ పరిధిలో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉన్నారుు. వీటిలో మంగపేట మండలం బ్రాహ్మణపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తరుునప్పటికీ... ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ప్రజలు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చుంచుపల్లి పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తోంది.
తాడ్వాయి మండలం కాటాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభమైనా... ఇప్పటివరకు సిబ్బందిని కేటాయించలేదు. తాడ్వాయి పీహెచ్‌సీకి చెందిన వైద్య సిబ్బంది ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ములుగు ఏజెన్సీ పరిధిలో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక వైద్యుడు, 43 ఏఎన్‌ఎం పోస్టులు, 4 స్టాఫ్‌నర్సు, 14 పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి పరిధిలోని సబ్ సెంటర్లలో 40 శాతం ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవడం వల్ల ఏజెన్సీలో అనారోగ్య సమస్యలు తలెత్తితే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రావాల్సి వస్తోంది.
రోగమొస్తే ఒళ్లుగుల్ల...
ప్రభుత్వ వైద్యశాలల్లో అరకొర సిబ్బంది కారణంగా ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది జిల్లా కేంద్రం వైపు వస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న డయూగ్నస్టిక్ సెంటర్ల నిర్వాహకులు రోగులను దోపిడీ చేస్తున్నారు. రోగనిర్ధారణ పరీక్షల ఖర్చు వారికి తడిసిమోపెడవుతోంది. ముఖ్యంగా డెంగీపై అవగాహన లేకపోవడంతో ప్లేట్‌లెట్ సంఖ్య పడిపోయిందన్న సమాచారం వినగానే రోగులు బెంబేలెత్తుతున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. ఫలితంగా రోగం కుదురుకునేలోపు అప్పులపాలవుతున్నారు. మరోవైపు నగరంలో మెడికల్ షాప్‌లు సిండికేటుగా మారడంతో ఔషధాల ధరలు చుక్కల్లో ఉంటున్నాయి. ఈ ధరలను నియంత్రించేందుకు ఇటు పాలకులు... అటు ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపించకపోవడంతో ఈ దందాకు అడ్డుకట్ట లేకుండా పోయింది.
సీనియార్టీ లిస్టులో గందరగోళం
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఐదో జోన్ పరిధిలో పదోన్నతులు, బదిలీలకు సంబంధిం చి వెలువరించిన సీనియారిటీ జాబితా గందరగోళానికి దారితీసింది. ఈ జాబితాను అందుబాటులో ఉంచడంలో ఆర్డీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సకాలంలో జాబితా అందక నాలుగు జిల్లాల పరిధిలోని వైద్య శాఖ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన జాబితాలో తప్పులు దొర్లాయి. అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 10 వరకు పొడిగించారు.
రాజయ్యా..రోగాలేందయ్యా!
Published Sun, Nov 2 2014 6:06 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement