విజయవాడ, న్యూస్‌లైన్ : పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ర్యాంకులపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ 100లో ర్యాంకులు సాధించిన 11 మంది నాన్‌లోకల్ అభ్యర్థులపై అనుమానం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విచారణలో ప్రాథమికంగా గుర్తించిన అంశాలను వేణుగోపాల్‌రెడ్డి వివరించారు.
ఈనెల 18న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈఎల్‌ఎస్ నరసింహన్ వెంటనే విచారణకు ఆదేశించారన్నారు. 19వ తేదీన హెల్త్ యూనివర్సిటీకి చేరుకుని మూల్యాంకన ప్రక్రియపై ప్రాథమికంగా విచారణ చేశామన్నారు. అనంతరం 20వ తేదీ గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల యంలో బహిరంగ విచారణ చేయగా, 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారన్నారు. విద్యార్థులు నిర్ధిష్టంగా ఫిర్యాదు చేయనప్పటికీ వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించగా, మొదటి 100లోపు మంచి ర్యాం కులు సాధించిన 11 మంది నాన్‌లోకల్ అభ్యర్థులపై ప్రాథమికంగా అనుమానిస్తున్నామన్నారు.
11 మంది నాన్‌లోకల్ అభ్యర్థుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు గుంటూరుకు చెందిన వారని, మిగిలిన ముగ్గురు కరీంనగర్, కర్నూలు, హైదరాబాద్ చెందిన వారన్నారు. ఈ 11 మంది నాన్‌లోకల్ అభ్యర్థులు పాండిచ్చేరి జిపమర్ (3), దావణగిరి(2), గుల్బార్గా(3), బెల్గాం(1), చైనా(2)లో 2012-13 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తిచేసి మొదటి సారి ప్రవేశ పరీక్షకు హాజరై 100లోపు మంచి ర్యాంకులు సాధించడం పట్ల కొంత అనుమానిస్తున్నట్లు తెలిపారు. లోతైన దర్యాప్తు చేస్తేనే నిగ్గుతేలుతుందన్నారు. బహిరంగ విచారణలో విద్యార్థులు అనేక మంది దళారీల నెంబర్లు ఇస్తామని చెప్పారేగాని ఇవ్వలేదని, ఒక్క వినీత్ సింగ్‌పేరుతో సెల్‌నెంబర్ ఇచ్చారని ఆ నెంబ ర్‌పై దర్యాప్తు చేస్తామన్నారు.
విద్యార్థులు రీ-ఎగ్జామ్‌పై డిమాండ్ చేయలేదన్నారు. సీబీఐ దర్యాప్తునే కోరారన్నారు. ప్రాధమిక విచారణ నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు అందజేస్తామని తెలిపారు. పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష రెండు మూడు సార్లు రాస్తే మినహామంచి ర్యాంకులు వచ్చే అవకాశం లేదనే అభిప్రాయంతోనేకొంత అనుమానిస్తున్నామన్నామని సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు. అనుమానిత ర్యాంకర్ల ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు, కార్బన్ ఓఎం ఆర్ షీట్లను విచారణ కమిటీ క్షణ్ణంగా పరిశీలించందన్నారు.
ఇందులో తప్పిదం జరిగినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. విద్యార్థులు శనివారం సాయంత్రం వరకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, వాటన్నిటిని క్రోడికరించి గవ ర్నర్‌కు నివేదిక ఇస్తామని తెలిపారు. అయితే యూనివర్సిటీ పరీక్షల విభాగాన్ని సంస్కరించాల్సి అవసరాన్ని కమిటీ సభ్యులు నివేదికలో చేర్చినట్లు సమాచారం. సమావేశంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ అచార్య రంగయ్య, రఘనాథ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ముందే ఊహించాం : తామిచ్చిన ఫిర్యాదులు వేరుని, విచారణ కమిటీ తేల్చిన అంశాలు వేరని జూడాలు మండిపడుతున్నారు. ఇదంతా తాము ముందే ఊహించామంటున్నారు. తామంతా విద్యార్థులమని, నిర్ధిష్టంగా ఫిర్యాదు ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. కేవలం సమాచారం ఇవ్వగలం గానీ పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాల్సింది కమిటీనేనన్నారు. సీబీఐతో విచారణ చేయాలని స్పష్టం చేశారు. త్వరలో భవిష్యత్తుకార్యచరణ ప్రకటిస్తామని జూడాలు తెలిపారు.
పీజీ మెడికల్ ర్యాంకుల వివాదం పై ముగిసిన ప్రాథమిక విచారణ
Published Sat, Mar 22 2014 12:50 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement