
యశోదలో గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతం
హైదరాబాద్: సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. దాదాపు 6గంటలపాటు గుండెమార్పిడి సర్జరీని ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరించి 45ఏళ్ల మహిళకు అమర్చారు.
ఈ రోజు ఉదయం గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్సులో నేరుగా ఆస్పత్రికి గుండెను చేర్చారు. ఇందుకోసం ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ యంత్రాంగం చర్యలు తీసుకుంది . కేవలం మూడే మూడు నిమిషాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి శర వేగంగా సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల పద్మకు ఈ గుండెను అమర్చారు. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.