శంషాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
- గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రి దగ్ధం
- సురక్షితంగా బయటపడిన 30 మంది
శంషాబాద్ (రాజేంద్రనగర్): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఆరంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 30 మంది ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.దాదాపు రూ.కోటి కి పైగా ఆస్తి నష్టం జరి గిందని అంచనా. ఇక్కడి మధురానగర్ కాలనీలో ఫిరంగి నాలాను ఆనుకొని ఈ భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉండగా, ఒకటో అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు అనుపమ లాడ్జిని నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఐదున్నర ప్రాంతంలో కాలనీలోని 11 కేవీ వైరు.. ఎల్‌టీ వైరుపై పడటంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది.
దీంతో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైర్లు దగ్ధమై పొగలు రావడంతో యజమాని, సెక్యూరిటీ గార్డు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. మొదటి అంతస్తులోని లాడ్జి రిసెప్షన్ గది కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఉన్న మందులతో పాటు ఇతర సామగ్రి, రికార్డులు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటల సెగలు పైకి ఎగబాకుతుండడంతో లాడ్జి గదు ల్లో ఉన్న సుమారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నాలుగు ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తేవడంతో వారంతా బయటకు వెళ్లారు.