మూసీకి పోటెత్తిన వరద | Heavy Flood Water Flow in Musi River | Sakshi
Sakshi News home page

మూసీకి పోటెత్తిన వరద

Published Wed, Oct 4 2017 11:47 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Heavy Flood Water Flow in Musi River - Sakshi

ప్రాజెక్టు గేట్లనుంచి విడుదలవుతున్న నీరు

నల్లగొండ, కేతేపల్లి (నకిరేకల్‌) : ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ రిజర్వాయర్‌కు మంగళవారం ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్‌ నగరంతో పాటు మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుయి. ఆయా వాగుల ద్వారా మూసీ రిజర్వాయర్‌లోకి మంగళవారం ఉదయం ఐదు వేల క్యూసెక్కుల వరద వస్తోంది. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

ఇప్పటికే ప్రాజెక్ట్‌ నీటిమట్టం 645 అడుగుల పూర్తిస్థాయికి చేరువలో ఉండటంతో, ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులో నీటిమట్టాన్ని తగ్గించాలని నిర్ణయించారు.  దీంతో మంగళవారం ఉదయం 2, 3, 4, 7, 8, 10వ నంబర్‌ క్రస్ట్‌ గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 12,000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 250 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 643 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 4.4 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో 4.3 టీఎంసీల నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

మూసీ వద్ద సందర్శకుల సందడి..
మూసీగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండటంతో ప్రాజెక్టు వద్ద మంగళవారం సందర్శకులు సందడి నెలకుంది. ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తిన విషయం తెలుసుకున్న కేతేపల్లి, సూర్యాపేట, నకిరేకల్, అర్వపల్లి తదితర మండలాల ప్రజలు డ్యాం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దిగువకు వెళ్తున్న నీటిని తమ ఫోన్‌ కెమెరాల్లో బంధిస్తున్నారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులతో పాటు సమీప గ్రామాల ప్రజలు అక్కడ తమ వాహనాలను నిలిపి.. సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement