పుష్కరాలపై ‘కోటి’ఆశలు
భద్రాచలం : గోదావరి పుష్కరాలు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతాయని భద్రాచలం దేవస్థానం అధికారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈవోగా కూరాకుల జ్యోతి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేవస్థానానికి ఆదాయ వనరులు ఎలా పెంచాలనే దానిపై తనదైన శైలిలో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇది వరకే ప్రసాదాల ధరలు, పూజా టి క్కెట్ల ధరలను పెంచిన ఆమె గోదావరి పుష్కరాలతో మరింత ఆదాయం వచ్చేలా దృష్టి సారించారు. ఉన్నతాధికారులు వద్దన్నప్పటికీ, గోదావరి పుష్కరాల సమయంలో శీఘ్ర దర్శనం పేరుతో టిక్కెట్లును ఏర్పాటు చేశారు.
అదే విధంగా స్వామి వారి నిత్యకల్యాణం, సహస్ర నామార్చన పూజలు, ఊంజల్ సేవను నిర్వహించేందుకే సిద్ధమయ్యారు. కల్యాణం, సహస్రనామార్చన, ఊంజల్ సేవలకు ఒక్కో దానికి రూ.1000 టిక్కెట్టును నిర్ణయించారు. పుష్కరాల పన్నెండు రోజుల్లో ఎంత లేదన్నా రూ.14 కోట్ల మేర ఆదాయం వచ్చేలా తగిన ప్రణాళిక రూపొందించి, యంత్రాంగాన్ని అప్రమత్తం చే శారు. పై మూడు పూజల ద్వారా పన్నెండు రోజులకు రూ.3.60 కోట్లు రాబట్టేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా శీఘ్ర దర్శనం పేరుతో 20 వేల మంది భక్తులకు రూ.200 టిక్కెట్టును విక్రయించటం ద్వారా రూ.4.80 కోట్ల మేర ఆదాయం రానుంది.
20 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3 కోట్లు ఆదాయం లభించనుంది. హుండీల కౌంటింగ్ ద్వారా రూ.3 నుంచి 4 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.1.70 కోట్లు మాత్రమే భద్రాద్రి దేవస్థానంకు నిధులు మంజూరయ్యాయి. అయితే పుష్కరాలకు పన్నెండు రోజుల పాటు ప్రసాదాల తయారీ, ఇతర మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు ఎంత లేదన్నా రూ.6 కోట్ల వరకూ ఖర్చు రానుంది. ఇది పోను రూ.8 కోట్ల వరకూ ఆదాయం దేవస్థానంనకు మిగిలే అవకాశం ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా నాలుగు జిల్లాలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లలో తగిన స్థాయిలో నీళ్లు లేకపోవటంతో, భద్రాచలంనకు బాగానే భక్తులు వస్తారని సమాచార ఉన్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు భారీ అంచనాలనే వేస్తున్నారు.