ఆదిలాబాద్ పట్టణం నుంచి సాత్నాల వైపు జీపుపైన ప్రమాదకరంగా కూర్చొని వెళ్తున్న ప్రయాణికులు
ఆదిలాబాద్: ఈనెల 6న నల్లగొండ జిల్లాలో పరిమితికి మించి ట్రాక్టర్‌లో 25మంది వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం లోయ లో పడి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడపడం, ఇంజిన్ సీటుపై ముగ్గురు కూర్చోవడంతో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతున్నా.. డ్రైవర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీపులు, ఆటోలు, టాటాఏసీల్లో పరిమితికి మించి నిత్యం ఇలా ప్రమాదపు అంచున ప్రయాణిస్తూ కనిపిస్తుంటారు. ఇందులో చాలా మంది సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం డ్రైవింగ్ చేసే వారే ఉంటారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది.
పరిమితికి మించి ప్రయాణం..
పరిమితికి మించి ప్రయాణం.. ప్రాణం మీదకు తెస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏడాది ప్రయాణికులను తరలించే వాహనాలతో పాటు కొన్నిసార్లు గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఇందులో ముఖ్యంగా జీపులు, ఆటోలు, టాటాఏస్‌లు టాప్ పైనే కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. డ్రైవర్ కూర్చొని వాహనం నడిపే వీలులేకుండా ముందర సీట్లో ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఆటోలో నలుగురు ప్రయాణికులు కూర్చోవాలి. కానీ ఆటో డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా అత్యాశతో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. జీపులు, టాటాఏస్‌లో కూడా ఈ ఇదే పరిస్థితి.
గ్రామాల నుంచి తరలింపు..
వాహనాల్లో ప్రయాణించే క్రమంలో గ్రామాల నుంచి వచ్చే జీపులు, ఆటోలు, టాటా ఏఎస్‌లలో 10 మందికి తక్కువ కాకుండా తీసుకొస్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేసే సమయంలో వారిని చూసే వాహనాలు అక్కడే నిలిపివేస్తున్నారే తప్ప.. ప్రయాణికులను మాత్రం తగ్గించడం లేదు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లే సమయంలో, పాఠశాలలకు విద్యార్థులను తరలించేటప్పుడు ఎక్కువ మందిని తీసుకెళ్తున్నారు. నిత్యం ఆదిలాబాద్ పట్టణంలో ఆటోల్లో విద్యార్థులు ముందు సీట్లలో, వెనకసీట్లలో నిండిపోయి కనిపిస్తుంటారు. జరగరానిది ఏదైనా జరిగితే చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా వాహనదారులు, డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు. ధనార్జనే ధ్యేయంగా కొంత మంది పరిమితికి మించి ప్రయాణికులను తరలించి ప్రాణం మీదకు తీసుకొస్తున్నారు.
నిబంధనలు గాలికి..
వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులతో పాటు ప్రయాణికులను తరలించే డ్రైవర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇందులో అతివేగంగా నడపడంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం నిబంధనలకు విరుద్ధమే. కొంత మందికి లైసెన్సు లేకుండా కూడా వాహనాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు తనఖీ చేసే సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిబంధనల ప్రకారం వాహనాలకు ఉండాల్సిన పత్రాలు ఉంచుకోవడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆటోల్లోనే పట్టణాలకు వస్తుంటారు. అయితే వాహనాలు నిండే వరకు డ్రైవర్ ప్రయాణికులను తీసుకెళ్లకపోవడం గమనార్హం. దీంతో డ్రైవర్‌కు ముందు సీట్లలో ఇరువైపులా కూర్చోబెట్టుకోవడం ద్వారా వాహనం అదుపు చేయలేక బోల్తాపడుతున్నాయి.
పరిమితికి మించితే చర్యలు
వాహనాల్లో ప్రయాణికులను పరిమితికి మించి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఆటోలు, జీపులపైన కూర్చోబెట్టి తీసుకెళ్లకూడదు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడడం వల్ల వాహనాలు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. మన ప్రాణాలే కాదు.. మన మీద ఆధారపడిన వారు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకొని డ్రైవర్లు వాహనాలు నడపాలి.
– నర్సింహారెడ్డి, డీఎస్పీ ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment